
టొరంటో: తోక తెగిన బల్లులను మనం చాలాసార్లు చూసే ఉంటాం. అలా ఎందుకు తెగుతుందో కూడా మనకు తెలిసిందే. కేవలం శత్రువుల నుంచి తనను తాను కాపాడుకునేందుకే బల్లి తన తోకను తెంపుకుంటుందట. ఈ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. తెగిన తోక మళ్లీ ఎలా పుట్టుకొస్తుంది? బల్లి వెన్నెముక తోక వరకు విస్తరించి ఉంటుంది కదా? మరి వెన్నెముక కూడా కొత్తగా ఎలా పుట్టుకొస్తుంది? ఈ విషయమై పరిశోధన జరిపిన కెనడాలోని గెల్ఫ్ యూనివర్సిటీ పరిశోధకులు.. అందుకు కారణం స్టెమ్‌సెల్సేనని గుర్తించారు.
తెగిపోయిన బల్లి తోక ఎలా పెరుగుతోందో తెలుసుకునే విషయమై ఇప్పటిదాకా జరిగిన పరిశోధనలేవీ కచ్చితమైన సమాధానాన్ని ఇవ్వలేకపోయాయని, అయితే తోకవరకు విస్తరించిన వెన్నుపూసలోని రేడియల్ గ్లియా అనే ప్రత్యేక కణాలు స్టెమ్‌సెల్స్‌గా మారి, తోక పునరుత్పత్తికి సహకరిస్తున్నాయని తమ పరిశోధనలో గుర్తించామని పరిశోధకుల్లో ఒకరైన మాథ్యు వికారియస్ వెల్లడించారు. తోక తెగిన వెంటనే ఈ రేడియల్ గ్లియా కణాలు క్రియాశీలకంగా మారి, తోక పెరగడానికి కారణమవుతాయని చెప్పారు. అయితే ఈ పరిశోధనతో మానవ వెన్ను సమస్యలను కూడా పరిష్కరించవచ్చని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment