రెండేళ్లలో రెక్కల కార్లు
ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. ఆ మధ్య వచ్చిన తెలుగు సినిమా పాట ఇది. భూమ్మీద చాలామంది ఆశ కూడా ఇదే.. ఎగిరే కార్లు వచ్చేస్తే ఎంత బాగుంటుంది అని! వాటి మాటేమిటోగానీ.. ఇంకో మూడేళ్లలో ఎగిరే ట్యాక్సీలైతే గ్యారెంటీ అంటోంది లిలియం! జర్మనీకి చెందిన కంపెనీ ఇది. ఫొటోలో కనిపిస్తున్న ఎగిరే ట్యాక్సీని ఈమధ్యే విజయవంతంగా ప్రయోగించింది లిలియం! అబ్బో ఇలాంటివి చాలా చూశాం గానీ.. దీని స్పెషాలిటీస్ ఏమిటో అంటున్నారా? ఫస్ట్... ఇది పూర్తిగా విద్యుత్తుతో నడుస్తుంది. అంటే.. కాలుష్యం అస్సలు ఉండదన్నమాట. సెకండ్ .. పార్క్ చేసిన చోటు నుంచి నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. విమానాలు, కొన్ని రకాల ఎగిరే కార్ల మాదిరిగా రన్‌వే లేకుండానే కావాల్సిన చోటికి చెక్కేయవచ్చు.
ధర్డ్... మొదటి, రెండు ప్రత్యేకతల కారణంగా దీంట్లో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఫోర్త్.. ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు.. దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అది కూడా గంటకు 300 కి.మీల వేగంతో! దీనర్థం... హైదరాబాద్ నుంచి ఇటు అదిలాబాద్.. అటు విజయవాడ గంటలో చేరుకోవచ్చు. ఫిఫ్త్.. ఒక్కో దాంట్లో ఐదుగురు ప్రయాణించవచ్చు కాబట్టి.. ఫుల్ అయ్యేంతవరకూ వేచి చూడాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఇంకో విషయం. పైలట్ అవసరం కూడా లేకుండా డ్రోన్ మాదిరిగా ఎగురుతుంది ఇది. సరేగానీ ఎలా పనిచేస్తుంది అంటారా? కారు ముందు, వెనుక భాగాల్లో ఉన్న రెక్కలాంటివి చూశారుగా.. దాంట్లోనే 36 ఫ్యాన్ల వంటివి ఉన్నాయి కదా.. వాటిని విద్యుత్ మోటార్ల సాయంతో స్పీడ్‌గా తిప్పితే చాలన్నమాట.
నిట్టనిలువుగా పైకి ఎగిరేందుకు.. ఆ వెంటనే ముందుకు దూసుకెళ్లేందుకు తగిన విధంగా వీటి దిశ మార్చుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఫ్యాన్ పాడైనప్పటికీ దాని ప్రభావం మిగిలిన వాటిపై పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఇదేదో బాగానే ఉందే.... ఎప్పుడు వస్తుందో అనేనా మీ డౌట్.. తొలి ప్రయోగం సక్సెస్ అయింది. 2019కి ప్రయాణీకులతో, మరికొన్ని ఇతర పరీక్షలు పూర్తి చేసి 2020 నాటికల్లా మార్కెట్‌లోకి తెస్తామంటోంది లిలియం.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్