విదేశాలకు ‘పసిడి ద్వారం’ | Golden visa for citizenship in those countries | Sakshi
Sakshi News home page

విదేశాలకు ‘పసిడి ద్వారం’

Published Fri, May 12 2017 1:40 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

విదేశాలకు ‘పసిడి ద్వారం’ - Sakshi

విదేశాలకు ‘పసిడి ద్వారం’

ఆయా దేశాల్లో పౌరసత్వానికి గోల్డెన్‌ వీసా
మరింత మెరుగైన జీవనం కోసం విదేశాలకు వలస వెళ్లాలంటే.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చదువు, ఉద్యోగం కోసం వీసాలు సంపాదించుకుని పయనమవుతారు. డాలర్‌ డ్రీమ్స్‌ స్వర్గంగా భావించే అమెరికా మొదలుకుని ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జర్మనీ ఇలా ఎన్నో దేశాలకు నిత్యం వలసలు సర్వసాధారణం. ఆ వీసాల గడువు ఎప్పుడు ముగుస్తుందో ఎలా పొడిగించుకోవాలా? అని ఆందోళన చెందుతుంటారు.

ఈ కష్టాలేవీ లేకుండా అమెరికా సహా చాలా దేశాలకు ముందుగానే కుటుంబ సభ్యులందరికీ శాశ్వత వీసాలు పొంది ఐదారేళ్లలోనే శాశ్వత నివాసం, పౌరసత్వం పొందేందుకు స్వర్ణ ద్వారాలున్నాయి. అందుకు కావల్సింది పెట్టుబడి మాత్రమే!! ‘మా దేశాల్లో పెట్టుబడి పెట్టండి. స్థిరాస్తులు కొనండి. మా ప్రభుత్వాల బాండ్లు కొనండి. ఓ ఐదారేళ్ల పాటు ఆ పెట్టుబడుల్ని కదిలించకుండా ఉంచండి. కొత్త వ్యాపారమో, పరిశ్రమో పెట్టి.. కనీసం ఒకరికో లేక పది మందికో ఉద్యోగాలు కల్పించండి.

మీకు, మీ జీవిత భాగస్వామికి, మీ మైనర్‌ పిల్లలకు శాశ్వత వీసాలు ఇస్తాం. నిర్ధిష్ట గడువు తర్వాత శాశ్వత నివాసం, పౌర సత్వం కల్పిస్తాం’ అంటూ చాలా దేశాలు ‘గోల్డెన్‌’ చాన్స్‌ కల్పిస్తున్నాయి. పెట్టాల్సిన పెట్టుబడుల మొత్తం ఆయా దేశాల్ని బట్టి రూ. కోటి నుంచి ఐదారు కోట్ల వరకూ ఉంది. అయితే ఎలాంటి చింతా లేకుండా నచ్చిన దేశంలో సెటిలైపోవచ్చు. నచ్చిన పని చేసుకుంటూ బతకవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే.. ఆయా దేశాల పౌరసత్వాల్ని డబ్బులతో కొనుక్కుని ఇంటిల్లిపాదీ రెక్కలు గట్టుకుని అక్కడికి ఎగిరిపోవచ్చు!!

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు పెట్టుబడులు పెట్టే వారిని ఆకర్షించేందుకు శాశ్వత నివాసం, సత్వర పౌరసత్వం పథకాల్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకాలనే ‘గోల్డెన్‌ వీసా’ పథకాలుగా వ్యవహరిస్తున్నారు. వీటికి చాలా గిరాకీ ఉంది. ముఖ్యంగా అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల గోల్డెన్‌ వీసాలకు డిమాండ్‌ ఎక్కువ. 5 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.22 కోట్లు) పెట్టుబడి పెడితే అమెరికా శాశ్వత పౌరసత్వం లభిస్తుంది. 20 లక్షల పౌండ్లతో(రూ. 16.60 కోట్లు) బ్రిటన్లో శాశ్వత నివాసం పొందవచ్చు. 2–8 లక్షల కెనడియన్‌ డాలర్లు (కోటి నుంచి రూ. 4 కోట్లు) పెట్టుబడితో కెనడాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవచ్చు.

అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలు హెచ్‌1బీ వీసాలపై ఆంక్షల్ని కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ గోల్డెన్‌ వీసాలపై దృష్టి పెడుతున్నారు. యూరప్‌లోని అన్ని దేశాలూ గోల్డెన్‌ వీసా పథకాలు అందిస్తున్నాయి. ఏ ఒక్క దేశ పౌరసత్వం పొందినా ‘షెంజెన్‌ ప్రాంతం’లోని మిగతా యూరప్‌ దేశాలకు వీసా అవసరం లేకుండా ప్రయాణిం చవచ్చు. మాల్టా వంటి కొన్ని యూరప్‌ దేశాల పాస్‌పోర్ట్‌ ఉంటే.. అమెరికా వెళ్లడానికి వీసా అవసరం లేదు. అంతేకాదు యూరప్‌లోని గ్రీస్‌ వంటి దేశాలకు గోల్డెన్‌ వీసాల ఖర్చు తక్కువ.

10 కోట్లు పెడితే భారత్‌లోనూ..
భారతదేశంలో కూడా రూ. 10 కోట్ల నుంచి రూ. 25 కోట్ల వరకూ పెట్టుబడులు పెడితే విదేశీయులకు శాశ్వత నివాస హోదా కల్పిస్తారు. కనీసం 20 మందికి ఉపాధి కల్పిస్తే పెట్టుబడిదారుడికి, ఆ వ్యక్తి జీవిత భాగస్వామి, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు శాశ్వత నివాస హోదా ఇస్తారు. వాళ్లు ఇక్కడ నివసించడానికి ఇల్లు కూడా కొనుక్కోవచ్చు. ఈ పథకం పాకిస్తాన్, చైనా దేశస్తులకు వర్తించదు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాదే ఆమోదం తెలిపింది. 

దేశం              పెట్టుబడి (రూ.లలో)    
అమెరికా            3.22 కోట్లు
కెనడా                4 కోట్లు
బ్రిటన్‌             16.60 కోట్లు
ఆస్ట్రేలియా           7 కోట్లు
రష్యా                65 లక్షలు
గ్రీస్‌                1.75 కోట్లు
జర్మనీ            2.45 కోట్లు
స్పెయిన్‌          3,5 కోట్లు
మాల్టా             7 కోట్లు
స్విట్జర్లాండ్‌       6.3 కోట్లు
టర్కీ               45 లక్షలు
బెల్జియం          2.1కోట్లు
నెదర్లాండ్స్‌      3.5 కోట్లు
సింగపూర్‌       22.5 కోట్లు
హాంగ్‌కాంగ్‌       8 కోట్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement