
ఆల్ రైట్.. గుడ్‌నైట్!
మలేసియా బోయింగ్ విమానం అదృశ్యంపై మిస్టరీ వీడడం లేదు. 26 దేశాల నౌకలు, విమానాలు గాలిస్తున్నా సోమవారం పదో రోజూ దాని ఆచూకీ లభించలేదు.
గల్లంతైన విమాన కోపైలట్ చివరి సందేశం పదో రోజూ జాడలేని మలేసియా బోయింగ్
మలేసియా బోయింగ్ విమానం అదృశ్యంపై మిస్టరీ వీడడం లేదు. 26 దేశాల నౌకలు, విమానాలు గాలిస్తున్నా సోమవారం పదో రోజూ దాని ఆచూకీ లభించలేదు. ఈ ఉదంతంపై రోజూ కొత్త సంగతులు, కోణాలు వెలుగుచూస్తున్నాయి. విమానాన్ని అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్ల స్థావరానికి తీసుకెళ్లి ఉంటారని, పైలట్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బోయింగ్‌ను ఈ నెల 8న ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించేముందు అందులోని కోపైలట్ ఫరీక్ అబ్దుల్ హమీద్(27) నుంచి చివరి సందేశం అందినట్లు మలేసియా ఎయిర్‌లైన్స్ సీఈఓ అహ్మద్ యాహ్యా చెప్పారు. ‘మార్చి 7న అర్ధరాత్రి దాటాక 1.19 గంటలకు విమానం నుంచి చివరి రేడియో ట్రాన్స్‌మిషన్(సందేశం) అందింది. కాక్‌పిట్ నుంచి ‘ఆల్‌రైట్, గుడ్‌నైట్’ అనే మాటలు వినిపించాయి. అవి ఫరీక్‌వే.
అంతకుముందు 1.07 గంటలకు ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్స్ అడ్రసింగ్, రిపోర్టింగ్ సిస్టమ్(ఏసీఏఆర్‌ఎస్) నుంచి చివరి సందేశం అందింది. అయితే ఆ వ్యవస్థను ఎప్పుడు స్విచాఫ్ చేశారో తెలియడం లేదు’ అని అన్నారు. కాగా, పైలట్ జహరీ అహ్మద్‌షా(53), కోపైలట్ ఫరీక్‌లలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు రవాణా మంత్రి హిషాముద్దీన్ చెప్పారు. విమాన ప్రయాణికులు, సిబ్బందిలో ఎవరికైనా వ్యక్తిగత సమస్యలున్నాయా అని విలేకర్లు అడగ్గా ఆయన సమాధానం ఇవ్వలేదు.
ఫరీక్ ఎయిర్‌ఏసియాలో పైలట్‌గా పనిచేస్తున్న తన స్నేహితురాలు నదిరా రమ్లీని పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఓ పత్రిక తెలిపింది. మలేసియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ఐదుగురు భారతీయులు సహా 239 మందితో ఈ నెల 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ టేకాఫ్ తీసుకున్న గంటసేపటికి ఆచూకీలేకుండా పోవడం తెలిసిందే.
‘తాలిబన్ల స్థావరానికి..’
ఈ విమానాన్ని దుండగులు అఫ్ఘానిస్థాన్ సరిహద్దులోని తాలిబన్ల స్థావరానికి తీసుకెళ్లి ఉంటారని కొందరు వైమానిక నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ కోణంలో దర్యాప్తు చేసేందుకు దౌత్య అనుమతులు ఇవ్వాలని మలేసియా అధికారులు కోరుతున్నారని ‘ఇండిపెండెంట్’ పత్రిక తెలిపింది. విమానం గల్లంతు వెనుక.. దొంగిలించిన పాస్‌పోర్టులతో అందులో ఎక్కిన ఇద్దరు ఇరానియన్ల హస్తముండొచ్చని, విమానాన్ని హైజాక్ చేసి, గుర్తుతెలియని ప్రాంతంలో దింపి ఉంటారని ఇజ్రాయెల్ విమానయాన సంస్థ మాజీ ఉన్నతాధికారి ఐజాక్ యెఫెత్ అన్నారు. బోయింగ్ చివరి రేడియో సిగ్నళ్లు పంపే సమయానికి అది ఎక్కడో నేలపై ఉండొచ్చని వైమానిక నిపుణులు తెలిపారు. విమానాన్ని సైనిక రాడార్లు పసిగట్టకుండా బంగాళాఖాత గగనతలంపై విమానాల రద్దీని అవకాశంగా తీసుకోవడానికి వీలుందనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
విమానాన్ని 5వేల అడుగుల కిందికి తీసుకొచ్చి మళ్లీ పైకి తీసుకెళ్లినట్లు శాటిలైట్లు గుర్తించాయని వార్తలు రావడంతో ఈ అనుమానం వ్యక్తమవుతోంది. మరోపక్క.. పైలట్ జహరీ ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న విమాన నేవిగేషన్ సిములేటర్(అనుకరణ పరికరం)కు సంబంధించి అనుమానించాల్సిన అంశాలేవీ బయటపడలేదని తెలిసింది. 154 మంది చైనీయులు ఉన్న బోయింగ్ అదృశ్యంపై సమగ్ర వివరాలు ఇవ్వాలని చైనా ప్రధాని లీ కెకియాంగ్ మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌ను కోరారు.
గల్లంతుపై నెట్‌లో వింత ఊహాగానాలు!
మలేసియా విమానం గల్లంతుపై ఆధారాలు దొరక్క ఓవైపు దర్యాప్తు అధికారులు తలలు పట్టుకుంటుంటే మరోవైపు విచిత్రమైన తొమ్మిది ఊహాగానాలు మాత్రం ఇంటర్నెట్‌లో వ్యాపిస్తున్నాయి.
అవి ఏమిటంటే..
1. గ్రహాంతరవాసుల ప్రమేయం, 2. ప్రయాణికుల సెల్‌ఫోన్లు మోగుతుండటం, 3. స్నోడెన్ లింకు, 4. విమానంలోని 20 మంది ఇంజనీర్లను కిడ్నాప్ చేసిన ఇరాన్, 5. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌కు విమానం మళ్లింపు, 6. బెర్ముడా ట్రయాంగిల్ తరహా వాతావరణ పరిస్థితులు, 7. విమానాన్ని దాడికి ఉపయోగించేందుకు వియత్నాంకు మళ్లింపు, 8. విమానంలో ఎవరో మైక్రోన్యూక్లియర్ బాంబు అమర్చి బ్లాక్‌హోల్‌ను సృష్టించడం వల్ల దాని అయస్కాంత శక్తికి మొత్తం విమానం ఆవిరైపోవడం, 9. ఈ విమానం బోయింగ్ కంపెనీ తయారు చేసిన 404వది కావడం... హెచ్‌టీటీపీ పరిభాషలో 404 ఎర్రర్ అంటే ‘నాట్ ఫౌండ్’ అని అర్థం కాబట్టి విమానం గల్లంతై ఉంటుందని అనుమానం.