
రాత్రి ఉపవాసాలు నిద్రకు మంచిదట
న్యూయార్క్: రాత్రి వేళల్లో ఏమీ తినకుండా పడుకుంటే మధ్య రాత్రిలో ఆకలివేస్తుంది, సరిగ్గా నిద్ర పట్టదు.. లాంటి అభిప్రాయాలు మనలో చాలా మందికి ఉంటాయి. కానీ అవేమీ నిజం కాదని, రాత్రి పూట చేసే ఉపవాసాలు మంచి నిద్రకు దోహదం చేస్తాయని న్యూయార్క్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇలా చేయడం వల్ల ఏకాగ్రత, చురుకుదనం కూడా పెరుగుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. నిద్రపోతున్నప్పుడు పెద్ద వారిలో సుమారు 500 కేలరీలు ఖర్చవుతాయని ఈ అధ్యయనంలో కీలకపాత్ర పోషించిన డేవిడ్ చెప్పారు. ఈ అధ్యయనంలో భాగంగా 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 44 మందిని పరిగణలోకి తీసుకున్నారు.
వీరికి కొంత కాలం పాటు తిన్నంత ఆహారం, తాగినన్ని చక్కెర పానీయాలు ఇచ్చి వారు నిద్రపోతున్న సమయాన్ని, నిద్రలో ఎదుర్కొంటున్న లోపాలను గమనించారు. ఇలా 20 రోజులు గడిచాక వీరికి ఎలాంటి ఆహారం ఇవ్వకుండా కేవలం మంచి నీళ్లు మాత్రమే ఇచ్చి ఎలా నిద్రపడుతున్నదీ గమనించారు. కడుపునిండా తిన్నప్పటి కంటే ఎటువంటి ఆహారం తీసుకోనప్పుడే బాగా నిద్ర పట్టినట్టు వారు చెప్పారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా తినడం వల్ల నిద్రపరంగానే కాకుండా ఇతరత్రా సమస్యలు కూడా ఏర్పడతాయని అన్నారు.