సాక్షి, న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత సంతతికి చెందిన టెక్ దిగ్గజం, ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (47) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాత్యహంకారంపై పోరాడటానికి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ 37 మిలియన్ డాలర్లు ఇస్తుందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా అమెరికాలో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగిన నేపథ్యంలో పిచాయ్ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ ఘటనను ఖండించిన పిచాయ్ తాజాగా జాతి వివక్ష వ్యతిరేక పోరాటానికి అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. అంతేకాదు ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుల పట్ల గౌరవ సూచనగా 8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించాలని గూగుల్ , ఆల్ఫాబెట్ ఉద్యోగులను కోరారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక ఈ-మెయిల్ సందేశం పంపారు. (జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన)
అలాగే జాతి సమానత్వం కోసం పనిచేసే సంస్థలకు కంపెనీ 12 మిలియన్ డాలర్లు, జాతి వివక్ష సమాచారాన్ని అందించే సంస్థలకు యాడ్ గ్రాంట్లలో 25 మిలియన్ డాలర్లు నిధులను గూగుల్ ఇస్తుందని పిచాయ్ చెప్పారు. మొదటి గ్రాంటుగా ఒక మిలియన్ డాలర్లు చొప్పున సెంటర్ ఫర్ పోలీసింగ్ ఈక్విటీ, ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్ సంస్థలకు అందిస్తామని చెప్పారు. అలాగే తమ ప్రోగ్రామ్ ద్వారా వారికి కావాల్సిన సాంకేతిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లలో 32 మిలియన్ల డాలర్లు ఇందుకు విరాళంగా ఇచ్చామని పిచాయ్ చెప్పారు.
"నల్లజాతి సమాజం బాధపడుతోంది. మనలో చాలామంది మనం నమ్మేవాటి కోసం నిలబడటానికి మార్గాలు వెతుకుతున్నాం. అలా సంఘీభావం చూపే, ఇష్టపడే వ్యక్తులను మనం చేరుకోవాలి'' అని పిచాయ్ వ్యాఖ్యానించారు. కొంతమంది నల్లజాతి నాయకుల బృందంతో మాట్లాడానని, ఈ పోరాటంలో గూగుల్ తరపున ఎలా సహకరించగలం అనే దానిపై చర్చించామనీ, దీనిపై మరింత కృషి చేస్తున్నామని ఉద్యోగులకు అందించిన సమాచారంలో సుందర్ పిచాయ్ వెల్లడించారు. (మరోసారి పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్)
చదవండి : జార్జ్‌ది నరహత్యే !
Comments
Please login to add a commentAdd a comment