గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ | Google reopen offices from 6 July : gives workers Rs 75000 each | Sakshi
Sakshi News home page

గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : జూలై 6 నుంచి ఆఫీసు

Published Wed, May 27 2020 11:11 AM | Last Updated on Wed, May 27 2020 1:33 PM

Google reopen offices from 6 July : gives workers Rs 75000 each - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ / శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులతో ఉద్యోగులు దశల వారీగా కార్యాలయాలకు తిరిగి వచ్చేలా చర్యలు చేపడుతోంది. జూలై 6 నుంచి మరిన్ని నగరాల్లో తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు ఈ ఏడాది చివరి వరకు చాలా మంది ఇంటి నుండే పనిచేసే అవకాశం ఉన్నందున  వారికి అవసరమైన పరికరాలు, ఫర్నిచర్ ఖర్చుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఉద్యోగికి 1,000 డాలర్లు (సుమారు రూ. 75,000) ఇస్తున్నట్లు ప్రకటించారు.

కొంతమంది ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిన అవసరం ఉందని  పిచాయ్ పేర్కొన్నారు. జూన్ 10 లోగా సంబంధిత మేనేజర్లు ఆయా ఉద్యోగులకు సమాచారం ఇస్తారని, వారు వీలైతే ఆఫీసుకు రావడం, లేదా ఇంటి నుంచే పని కొనసాగించవచ్చని తెలిపారు. వారి వారి సామర్థ్యాలను బట్టి తిరిగి రావాలనుకునే వారికి పరిమితంగా అనుమతినిస్తున్నట్టు పిచాయ్ చెప్పారు. మిగతా అందరికీ ఈ ఏడాది చివరకు  వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉంటుందని తెలిపారు. (42 మందికి కరోనా : నోకియా ప్లాంట్ మూత)

ప్రతి రెండు వారాలకు ఒక రోజు ఆఫీసుకు వచ్చేలా ఉద్యోగులు ప్లాన్ చేసుకుంటే, ఒక ఆఫీసులో సుమారు 10 శాతం సిబ్బంది ఉంటారని దీన్ని ఆలోచించాలన్నారు.  పరిస్థితులు అనుకూలిస్తే రొటేషన్ ప్రోగ్రామ్‌ ద్వారా సెప్టెంబర్ నాటికి  30 శాతం ఉద్యోగుల హాజరు ఉంటుందని  గూగుల్ సీఈవో భావించారు. సామాజిక దూరం, పరిశుభ్రత లాంటి కఠినమైన ఆరోగ్య, భద్రతా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో గతం కంటే ఇపుడు ఆఫీసు వాతావరణం భిన్నంగా ఉంటుందని కొత్త అనుభూతి పొందుతారని ఆయన వెల్లడించారు. కరోనాకు ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఆఫీసులను నెమ్మదిగా తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ఉద్యోగుల రిమోట్గా పని చేసేందుకు అవసరమైన  అన్ని చర్యలపైనా ఎక్కువ దృష్టి పెట్టామని పిచాయ్ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement