ఆంగ్లం నేర్పే అందమైన భామలు
దక్షిణ కొరియాలో విద్యార్థినీ విద్యార్థులకు ఆంగ్లం బోధించే ఆన్‌లైన్ విద్యా సంస్థల వ్యాపారం వెర్రితలలు వేస్తోంది. తోటి సంస్థల పోటీని తట్టుకొని మార్కెట్‌లో నిలబడేందుకు పరువంలో ఉన్న అందమైన భామలను ఎర వేస్తున్నారు. వారు క్రీగంట చూపులతో కవ్విస్తూ, ఓరకంట చూపులతో హొయలొలకబోస్తూ ఆంగ్లం బోధిస్తున్నారు. అందులో 'గాడెస్ ఆఫ్ ఇంగ్లీష్' అనే ఆన్‌లైన్ విద్యాసంస్థ ఒక అడుగు ముందే ఉంది. ఆంగ్లం బోధించే తమ టీచర్లకు నిక్‌నేమ్‌లు కూడా పెట్టి విద్యార్థులను ఆకర్షిస్తోంది. బిజినెస్ సిండెరిల్లా, ప్రనన్షియేషన్ గాడెస్ లాంటి నిక్ నేమ్‌లతో ముద్దుగుమ్మలు ముద్దుముద్దుగా ఆంగ్లం బోధిస్తూ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారు. టీచర్ అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పుడే విద్యార్థులు ఆసక్తిగా చదువుతారని, ఇందులో తప్పేముందని ఆ విద్యా సంస్థ నిర్వాహకులు ఢంకా బజాయించి చెబుతున్నారు. నిజమే కాబోలేమో! సంప్రదాయ దుస్తుల్లో విద్యాబోధన చేస్తున్న 'రెడ్ ఇంగ్లీష్' అనే ఓ విద్యా సంస్థ కొత్త పోకడలను తట్టుకోలేక ఇటీవలనే మూతపడింది.
దక్షిణ కొరియాలో 17వేల విద్యా అకాడమీలు ఉన్నాయి. ఈ ఏడాది చదువు కోసం విద్యార్థులు రూ. 37 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు దేశంలోనే అత్యధిక సర్కులేషన్ గల చోసన్ ఇల్‌బో అనే పత్రిక వెల్లడించింది. ఇప్పుడు అనేక విద్యా సంస్థలు *గాడెస్ ఆఫ్ ఇంగ్లీష్* చూపిన బాటలోనే నడుస్తున్నాయని ఆ పత్రిక వెల్లడించింది.
ఆ పత్రిక కథనం ప్రకారం *గాడెస్ ఆఫ్ ఇంగ్లీష్* విద్యా సంస్థ టీచర్ల నియామకాల్లో ప్రతిభకు ప్రథమ ప్రాథామ్యం ఇవ్వకుండా అమ్మాయిల అందచందాలకు, వయస్సుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. కొంత మంది అమ్మాయిల మొఖాలకు కాస్మొటిక్ సర్జరీలు కూడా చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆ సంస్థ టీచర్ల ప్రొఫైళ్లు వివిధ భంగిమల్లో వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఈ విద్యా సంస్థలో ఆంగ్లం నేర్చుకునేందుకు 500 మంది విద్యార్థినీ విద్యార్థులు చేరారు. అందరూ 20 ఏళ్ల ప్రాయంవారే. వారిలో విద్యార్థినుల సంఖ్య తక్కువ. వారు టీచర్ల అందచందాలు చూస్తూ ఆంగ్లం నేర్చుకుంటారో, వలపు పాఠాలే నేర్చుకుంటారో పరీక్షల్లో వచ్చే మార్కులే తేల్చాలి.