‘డైట్’లో ఇంగ్లిష్ మీడియం
∙ ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
∙ తెలుగు మీడియంలో 50 సీట్ల కోత
∙ ఆదిలాబాద్ ‘డైట్’లో అమలు
∙ సర్కార్ బడుల్లో ఆంగ్ల విద్యాబోధన కోసం నిర్ణయం
ఆదిలాబాద్‌టౌన్: సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్æ) కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. ఇదివరకు తెలుగు, ఉర్దూ మీడియంలో డైట్ కళాశాలల్లో తరగతులు నిర్వహించే వారు. ఇకనుంచి అభ్యర్థులకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ప్రైవేట్ వైపే మొగ్గు చూపుతున్నారు. సర్కారు బడుల్లో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గడం, కొన్ని పాఠశాలలు మూతపడుతున్నాయి.
దీంతో సర్కార్ బడులను కాపాడుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డీఎడ్, బీఎడ్ శిక్షణ పూర్తి చేసిన వారితో విద్యాబోధన చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో డీఎడ్ విద్యార్హత లేని వారితోనే విద్యాబోధన సాగుతోంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రారంభించినా తెలుగు మీడియం ఉపాధ్యాయులతోనే పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఆంగ్ల బోధనకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఉమ్మడి జిల్లాలో..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆరు డైట్ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డైట్ కళాశాల, మావల మండల కేంద్రంలో వివేకానంద డీఎడ్ కళాశాల, కుమురంభీం(ఆసిఫాబాద్) జిల్లాలో శ్రీనిధి, మంచిర్యాలలో ఎస్‌ఆర్‌కేఎం డీఎడ్ కళాశాల, నిర్మల్‌లో పంచశీల్, ఉట్నూర్‌లో పులాజీ బాబా డీఎడ్ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ, వివేకానంద కళాశాలల్లో 100 సీట్ల చొప్పన, మిగతా కళాశాలల్లో 50 సీట్ల చొప్పన ప్రవేశాలు చేపడుతున్నారు. ఇదివరకు ఆదిలాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో మొత్తం 150 సీట్లకు ప్రవేశాలు చేపట్టేవారు. ఉర్దూ మీడియంలో 50 సీట్లు, తెలుగు మీడియంలో 100 సీట్లు అభ్యర్థులకు కేటాయించే వారు. ఈ విద్యా సంవత్సరంలో తెలుగు మీడియంలో 50 సీట్లకు కోత విధించారు. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం కలిగే విధంగా ఉంది.
భవిష్యత్తులో సర్కారు బడులకు డిమాండ్..
ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం పాఠశాలలను ప్రవేశపెట్టడంతోపాటు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో సర్కారు బడులకు డిమాండ్ పెరగనుంది. ఇంగ్లిష్ మీడియం బడులకు అవసరమైన బోధకులను తయారు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం పటిష్టం చేయనుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతోపాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది.
తెలుగు మీడియం విద్యార్థులకు నష్టం..
ఆదిలాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో తెలుగు మీడియంలో వంద సీట్లు భర్తీ చేసేవారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 50 సీట్లను కుదించారు. దీంతో తెలుగు మీడియం 50 మంది విద్యార్థులకు నష్టం కలగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మీడియంకు సంబంధించి మొత్తం 1050 సీట్లను ప్రభుత్వం తగ్గించింది. ఇందులో పది జిల్లాల్లోని ప్రభుత్వ డైట్ కళాశాలల్లో 50 సీట్ల చొప్పున 500 సీట్ల కోత విధించగా, మిగతావి ప్రైవేట్ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులను కేటాయించారు. ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు మాత్రం మేలు జరిగే విధంగా ఈ నిర్ణయం ఉంది. కొత్త సీట్లు పెంచేది పోయి తగ్గించడం, ప్రస్తుతం కౌన్సెలింగ్ కొనసాగుతుండడంతో జిల్లాలో 50 మంది అభ్యర్థులకు సీట్లు రాకుండా పోయాయి.