english teaching
-
‘డైట్’లో ఇంగ్లిష్ మీడియం
∙ ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు ∙ తెలుగు మీడియంలో 50 సీట్ల కోత ∙ ఆదిలాబాద్ ‘డైట్’లో అమలు ∙ సర్కార్ బడుల్లో ఆంగ్ల విద్యాబోధన కోసం నిర్ణయం ఆదిలాబాద్‌టౌన్: సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్æ) కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. ఇదివరకు తెలుగు, ఉర్దూ మీడియంలో డైట్ కళాశాలల్లో తరగతులు నిర్వహించే వారు. ఇకనుంచి అభ్యర్థులకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ప్రైవేట్ వైపే మొగ్గు చూపుతున్నారు. సర్కారు బడుల్లో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గడం, కొన్ని పాఠశాలలు మూతపడుతున్నాయి. దీంతో సర్కార్ బడులను కాపాడుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డీఎడ్, బీఎడ్ శిక్షణ పూర్తి చేసిన వారితో విద్యాబోధన చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో డీఎడ్ విద్యార్హత లేని వారితోనే విద్యాబోధన సాగుతోంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రారంభించినా తెలుగు మీడియం ఉపాధ్యాయులతోనే పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఆంగ్ల బోధనకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆరు డైట్ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డైట్ కళాశాల, మావల మండల కేంద్రంలో వివేకానంద డీఎడ్ కళాశాల, కుమురంభీం(ఆసిఫాబాద్) జిల్లాలో శ్రీనిధి, మంచిర్యాలలో ఎస్‌ఆర్‌కేఎం డీఎడ్ కళాశాల, నిర్మల్‌లో పంచశీల్, ఉట్నూర్‌లో పులాజీ బాబా డీఎడ్ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ, వివేకానంద కళాశాలల్లో 100 సీట్ల చొప్పన, మిగతా కళాశాలల్లో 50 సీట్ల చొప్పన ప్రవేశాలు చేపడుతున్నారు. ఇదివరకు ఆదిలాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో మొత్తం 150 సీట్లకు ప్రవేశాలు చేపట్టేవారు. ఉర్దూ మీడియంలో 50 సీట్లు, తెలుగు మీడియంలో 100 సీట్లు అభ్యర్థులకు కేటాయించే వారు. ఈ విద్యా సంవత్సరంలో తెలుగు మీడియంలో 50 సీట్లకు కోత విధించారు. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం కలిగే విధంగా ఉంది. భవిష్యత్తులో సర్కారు బడులకు డిమాండ్.. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం పాఠశాలలను ప్రవేశపెట్టడంతోపాటు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో సర్కారు బడులకు డిమాండ్ పెరగనుంది. ఇంగ్లిష్ మీడియం బడులకు అవసరమైన బోధకులను తయారు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం పటిష్టం చేయనుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతోపాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది. తెలుగు మీడియం విద్యార్థులకు నష్టం.. ఆదిలాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో తెలుగు మీడియంలో వంద సీట్లు భర్తీ చేసేవారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 50 సీట్లను కుదించారు. దీంతో తెలుగు మీడియం 50 మంది విద్యార్థులకు నష్టం కలగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మీడియంకు సంబంధించి మొత్తం 1050 సీట్లను ప్రభుత్వం తగ్గించింది. ఇందులో పది జిల్లాల్లోని ప్రభుత్వ డైట్ కళాశాలల్లో 50 సీట్ల చొప్పున 500 సీట్ల కోత విధించగా, మిగతావి ప్రైవేట్ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులను కేటాయించారు. ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు మాత్రం మేలు జరిగే విధంగా ఈ నిర్ణయం ఉంది. కొత్త సీట్లు పెంచేది పోయి తగ్గించడం, ప్రస్తుతం కౌన్సెలింగ్ కొనసాగుతుండడంతో జిల్లాలో 50 మంది అభ్యర్థులకు సీట్లు రాకుండా పోయాయి. -
ఆంగ్ల బోధన అక్కర్లేదా..?
► ముందుకు రాని గురువులు ► ప్రైవేటు వైపు తల్లిదండ్రుల చూపు ► నియోజకవర్గంలో దరఖాస్తులు చేసుకున్నది రెండు పాఠశాలలు ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో విద్యాబోధన సాగుతోందని ప్రభుత్వం ప్రచారానికి పోవడమే తప్పా అమలులో మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్ల విద్య బోధించాల్సి ఉన్నప్పటికీ కొందరు గురువులు ముందుకు రావడం లేదు. దీంతో ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువు ప్రారంభించేందుకు ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. నియోజకవర్గంలో కేవలం రెండు పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లిష్ మీడియం ప్రారంభించేందుకు దరఖాస్తులు చేసుకోవడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గుతుండడం, పలుచోట్ల మూతపడటం, తల్లిదండ్రుల డిమాండ్ నేపథ్యంలో సర్కారు బడులు కాపాడేందుకు ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గతేడాది ఒక్క ప్రభుత్వ పాఠశాలకు కూడా ఆంగ్ల మధ్యమం కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ సంవత్సరం కేవలం రెండు పాఠశాలలు మాత్రమే ముందుకొచ్చాయి. ఆంగ్ల బోధన చేసేందుకు గురువులు ముందుకు రాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ముందుకురాని గురువులు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం బోధించి సర్కారు బడులు కాపాడుకోవాల్సి ఉండగా, ఆ దిశగా ఉపాధ్యాయులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. ఇతర జిల్లాల్లో ఆంగ్ల మాధ్యమం పాఠశాలలు ప్రారంభమవుతుండగా, ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇంగ్లిష్ మీడియం కోసం ప్రతిపాదనలు రావడం లేదని విద్యాశాఖ అధికారులు ³ర్కొంటున్నారు. ఇప్పటికైనా అవకాశం విద్యా సంవత్సరం పున:ప్రారంభానికి మరో వారం రోజుల గడువు ఉంది. ప్రభుత్వం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలనే నిబంధన లేనప్పటికీ సర్కారు బడులు కాపాడుకోవాల్సిన ఉపాధ్యాయులు ఇప్పటికైనా ముందడుగు వేయాలని పలువురు పేర్కొంటున్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ, జీపీల తీర్మానాలు వేర్వేరుగా చేసి విద్యా శాఖకు పంపించాల్సి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంపై ఉపాధ్యాయులు ఔత్సాహికంగా లేకపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. తీర్మానం పంపిన పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించుకోవచ్చు. పై తరగతులు వెళ్లిన కొద్ది ఇంగ్లిష్ మీడియంలో చదువుతారు. మూతబడుతున్న సర్కారు బడులు ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగడం, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆంగ్ల విద్యనందించాలనే ఉద్దేశంతో రోజురోజుకు సర్కారు బడుల పరిస్థితి దారుణంగా మారుతోంది. కారణం ఏదైనా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కార్ బడులకు పంపడానికి మొగ్గు చూపడం లేదు. ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్లమాధ్యమం లేకపోవడమే కారణం. నియోజకవర్గంలో విద్యార్థుల సంఖ్య పది కంటే తక్కువగా ఉన్న పాఠ శాలలు 10 వరకు ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోనే ఒక్క విద్యార్థి లేకపోవడంతో రెండు పాఠశాలలు ఇప్పటికే మూతపడ్డాయి. భవిష్యత్‌లో సర్కారు బడులకు తాళాలు పడే పరిస్థితులు లేకపోలేదని పేర్కొంటున్నారు. -
వరంగల్ కలెక్టరేట్ జప్తునకు కోర్టు ఆదేశాలు
హన్మకొండ అర్బన్: బాధితులకు డబ్బులు చెల్లించే విషయంలో జిల్లా యం త్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం (మూవబుల్ ప్రాపర్టీ) జప్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు అమలు బాధ్యతను జిల్లా కోర్టుకు అప్పగించింది. 2006లో జిల్లా యంత్రాంగం ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో జిల్లాలోని సుమారు 500 మంది టీచర్లకు ఆంగ్ల బోధనపై శిక్షణ ఇప్పించింది. ఇందుకు సంబంధించి ఎల్టా అనే సంస్థకు రూ.1.50 లక్షలు చెల్లించే విష యంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఎల్టా ప్రతినిధులు జిల్లా కోర్టును ఆశ్రయించగా, కలెక్టరేట్ జప్తునకు ఆదేశాలు ఇచ్చింది.. దీనిపై అధికారులు స్టే తెచ్చుకుని అప్పీలుకు వెళ్లారు. చివరకు హైకోర్టు కూడా ఎల్టాకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బాధితులకు డబ్బు చెల్లించని కారణంగా కలెక్టరేట్ జప్తునకు గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఎత్తివేస్తూ ఆవే ఉత్తర్వులు అమలు చేయాలని చెప్పింది. ఈ క్రమంలో బాధితులు జిల్లా కోర్టులో ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసుకుని గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరారు. స్పందించిన కోర్టు ఖర్చులతో కలిపి బాధితులకు రూ.2.06 లక్షలు చెల్లించాలని ఆదే శించింది. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని జప్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు ఉత్తర్వులు అమల్లో భాగంగా ఫీల్డ్ అధికారి సత్తార్, ఎల్టా తరపున జిల్లా కోర్టులో వాదించిన న్యాయవాది హరిహరరావు కలెక్టరేట్ అధికారులకు ఉత్తర్వుల కాపీలు అందజేశారు. దీంతో వారంలో డబ్బులు చెల్లించే విధంగా అధికారులకు- ఎల్టా ప్రతినిధులకు మధ్య ఒప్పందం కుదిరిందని ఎల్టా ప్రతినిధులు కొమురయ్య, శ్రీనివాస్ తెలిపారు. -
ఎ ఫర్.. యాపిల్!
శ్రీకాకుళం: జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లోని చిన్నారులకు అ.. అమ్మతో పాటు ఎ ఫర్ యాపిల్‌ను కూడా బోధించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసి ఫలితాల ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పకడ్బందీగా అమ లు చేయాలని కలెక్టర్ భావిస్తున్నారు. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో అందరి దృష్టికి తేవాలని కలెక్టర్ నిశ్చయించారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఆంగ్ల బోధన చేయించడం ద్వారా ప్రైవేటు పాఠశాలల వైపు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొగ్గు చూపించకుండా ఉంటారని, పేద విద్యార్థులకు కూడా ఆంగ్ల బోధన అందుబాటులో ఉంటుందని కలెక్టర్ ఆలోచన . ఇప్పటికే జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను సేకరించారు. జిల్లాలో 2249 ప్రాథమిక పాఠశాలలు ఉండగా వీటిలో 83,598 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ ఇప్పటివరకు తెలుగు మాధ్యమంలో చదువుతుండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం సక్సెస్ స్కూ ళ్ల పేరిట ఆంగ్ల మాధ్యమ విద్యను ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిస్థాయిలో అవి సత్ఫలితాలనివ్వలేదు. ప్రాథమిక స్థాయిలో ఆంగ్లంపై పట్టులేకపోవడం వల్ల ఉన్నత తరగతుల్లో ఆంగ్ల మా ధ్యమం చదవలేక సగంలోనే బడి మానేయడమో, తెలుగు మాధ్యమానికి మారిపోవడమో జరుగుతూ వస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ కేం ద్రాల్లోని మూడేళ్ల లోపు పిల్లలకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి తరగతుల్లో బోధన చే యించాలని నిశ్చయించి ఇందుకు తగ్గట్టుగా త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. అంగన్వాడీలోని పిల్లలను సమీపంలోని ప్రాథమిక పాఠశాలలకు తీసుకొచ్చి ఉపాధ్యాయులతో ప్రీ ప్రైమ రీ విద్యను చెప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యో చిస్తోంది. అందుకే ఇదే అదనుగా ఆంగ్ల మాధ్యమాన్నీ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోను ఓ పాఠశాలను ఎంపిక చేసి తొలి దశగా ఆ పాఠశాలలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించి ఆంగ్ల మాధ్యమ పాఠశాలగా పనిచేసేలా చూడాలని కూడా కలెక్టర్ భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన స మాచారాన్ని కూడా ఇప్పటికే విద్యాశాఖ అధికారుల నుంచి తీసుకున్నారు. ఈ విషయమై కూ డా రాష్ట్ర అధికారులతో చర్చించనున్నారు. కలెక్టర్ ఆలోచనలకు రాష్ట్ర అధికారులు సమ్మతిస్తే పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ బోధన అం దుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం వద్ద సాక్షి ప్రస్తావిం చగా ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమా న్ని ప్రవేశపెట్టాలని యోచిస్తుండడం నిజమేనన్నారు. త్వరలోనే దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. ఉపాధ్యాయులు సరిపడినంత మంది ఉంటే ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఆం గ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు వద్ద ప్ర స్తావించగా అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను పాఠశాలల్లో బోధింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. అలాంటప్పుడు ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఆంగ్ల బోధన ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ వద్ద ప్రస్తావించినపుడు ఆయన సానుకూలంగా స్పందించి రాష్ట్ర అధికారులతో మాట్లాడతానని తెలిపారన్నారు. -
ఆంగ్లం నేర్పే అందమైన భామలు
దక్షిణ కొరియాలో విద్యార్థినీ విద్యార్థులకు ఆంగ్లం బోధించే ఆన్లైన్ విద్యా సంస్థల వ్యాపారం వెర్రితలలు వేస్తోంది. తోటి సంస్థల పోటీని తట్టుకొని మార్కెట్లో నిలబడేందుకు పరువంలో ఉన్న అందమైన భామలను ఎర వేస్తున్నారు. వారు క్రీగంట చూపులతో కవ్విస్తూ, ఓరకంట చూపులతో హొయలొలకబోస్తూ ఆంగ్లం బోధిస్తున్నారు. అందులో 'గాడెస్ ఆఫ్ ఇంగ్లీష్' అనే ఆన్లైన్ విద్యాసంస్థ ఒక అడుగు ముందే ఉంది. ఆంగ్లం బోధించే తమ టీచర్లకు నిక్‌నేమ్‌లు కూడా పెట్టి విద్యార్థులను ఆకర్షిస్తోంది. బిజినెస్ సిండెరిల్లా, ప్రనన్షియేషన్ గాడెస్ లాంటి నిక్ నేమ్‌లతో ముద్దుగుమ్మలు ముద్దుముద్దుగా ఆంగ్లం బోధిస్తూ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారు. టీచర్ అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పుడే విద్యార్థులు ఆసక్తిగా చదువుతారని, ఇందులో తప్పేముందని ఆ విద్యా సంస్థ నిర్వాహకులు ఢంకా బజాయించి చెబుతున్నారు. నిజమే కాబోలేమో! సంప్రదాయ దుస్తుల్లో విద్యాబోధన చేస్తున్న 'రెడ్ ఇంగ్లీష్' అనే ఓ విద్యా సంస్థ కొత్త పోకడలను తట్టుకోలేక ఇటీవలనే మూతపడింది. దక్షిణ కొరియాలో 17వేల విద్యా అకాడమీలు ఉన్నాయి. ఈ ఏడాది చదువు కోసం విద్యార్థులు రూ. 37 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు దేశంలోనే అత్యధిక సర్కులేషన్ గల చోసన్ ఇల్బో అనే పత్రిక వెల్లడించింది. ఇప్పుడు అనేక విద్యా సంస్థలు *గాడెస్ ఆఫ్ ఇంగ్లీష్* చూపిన బాటలోనే నడుస్తున్నాయని ఆ పత్రిక వెల్లడించింది. ఆ పత్రిక కథనం ప్రకారం *గాడెస్ ఆఫ్ ఇంగ్లీష్* విద్యా సంస్థ టీచర్ల నియామకాల్లో ప్రతిభకు ప్రథమ ప్రాథామ్యం ఇవ్వకుండా అమ్మాయిల అందచందాలకు, వయస్సుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. కొంత మంది అమ్మాయిల మొఖాలకు కాస్మొటిక్ సర్జరీలు కూడా చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆ సంస్థ టీచర్ల ప్రొఫైళ్లు వివిధ భంగిమల్లో వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఈ విద్యా సంస్థలో ఆంగ్లం నేర్చుకునేందుకు 500 మంది విద్యార్థినీ విద్యార్థులు చేరారు. అందరూ 20 ఏళ్ల ప్రాయంవారే. వారిలో విద్యార్థినుల సంఖ్య తక్కువ. వారు టీచర్ల అందచందాలు చూస్తూ ఆంగ్లం నేర్చుకుంటారో, వలపు పాఠాలే నేర్చుకుంటారో పరీక్షల్లో వచ్చే మార్కులే తేల్చాలి. -
ఇంగ్లిష్ బోధనను బలోపేతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: సమాజంలో పేదలు.. ధనికులు అన్న భావనలాగే.. ఇంగ్లిష్ వచ్చినవాళ్లు.. రానివాళ్లు అనే పెడ ధోరణి నాటుకుపోయిందని, దీన్ని రూపుమాపాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనను బలోపేతం చేయాల్సి ఉందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. నగరంలోని హెచ్ఐసీసీలో ఇంటర్నేషనల్ టీచర్ ఎడ్యుకేటర్ ఐదో సదస్సు (టీఈసీ -2015) శుక్రవారం ప్రారంభమైంది. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ), బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సులో గవర్నర్ ప్రారంభోపన్యాసం చేశారు. మనదేశంలో విస్తృతంగా మానవ వనరులున్నాయని, ప్రతి ఒక్కరికి మాతృభాష, ఇంగ్లిష్‌తోపాటు ఫారిన్ లాంగ్వేజ్ వస్తే ఆ వనరులను సద్వినియోగం చేసుకోవచ్చని, తద్వారా ప్రపంచపటంలో దేశం అగ్రగామిగా నిలుస్తుందని నరసింహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ మూడు భాషలను ప్యాకేజీగా పిల్లలకు అందించాలని సూచించారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదని, మాతృభాష ఆధారంగా ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని చెప్పారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్‌కు ప్రముఖ స్థానం ఉందని, అనేక ప్రాంతీయ భాషలున్న దేశంలో.. వీటన్నింటికీ ఇంగ్లిష్ అనుసంధాన భాషగా మారిందన్నారు. విద్యార్థుల జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయునిదే కీలక స్థానమని, అలాంటి ఉపాధ్యాయుడికి అత్యుత్తమ నైపుణ్యాలు ఉండాలని దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా.. దేశంలో ప్రతిష్టాత్మక వర్సిటీలకు కొదవలేదని, ఆ స్థాయిలో విద్యార్థులకు ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు ఉండాలని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ అభిప్రాయపడ్డారు. దేశంలో 70 శాతం ఉన్న యువతకు ఇంగ్లిష్ భాషలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఇఫ్లూ వీసీ సునయన సింగ్ పేర్కొన్నారు. బ్రిటిష్ కౌన్సిల్ ద్వారా అత్యుత్తమ నాణ్యతగల ఇంగ్లిష్ భాషను అందిస్తున్నామని బ్రిటిష్ సౌత్ ఏషియా డెరైక్టర్ క్రిస్ బ్రాండ్ఉడ్ చెప్పారు. బ్రిటిష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డెరైక్టర్ మి-క్వి బార్కర్, ఇఫ్లూ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ స్కూల్ డీన్ ప్రొఫెసర్ మోహన్‌రాజ్ మాట్లాడారు. ఈ సదస్సుకు 30 దేశాల నుంచి వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. మార్చి 1 వరకు కొనసాగే ఈ సదస్సులో నాణ్యమైన బోధన, స్పీకింగ్ స్కిల్స్, టీచర్ ఎడ్యుకేషన్ అంశాలపై చర్చిస్తారు.