ఇంగ్లిష్ బోధనను బలోపేతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: సమాజంలో పేదలు.. ధనికులు అన్న భావనలాగే.. ఇంగ్లిష్ వచ్చినవాళ్లు.. రానివాళ్లు అనే పెడ ధోరణి నాటుకుపోయిందని, దీన్ని రూపుమాపాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనను బలోపేతం చేయాల్సి ఉందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్ టీచర్ ఎడ్యుకేటర్ ఐదో సదస్సు (టీఈసీ -2015) శుక్రవారం ప్రారంభమైంది. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ), బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సులో గవర్నర్ ప్రారంభోపన్యాసం చేశారు.
మనదేశంలో విస్తృతంగా మానవ వనరులున్నాయని, ప్రతి ఒక్కరికి మాతృభాష, ఇంగ్లిష్‌తోపాటు ఫారిన్ లాంగ్వేజ్ వస్తే ఆ వనరులను సద్వినియోగం చేసుకోవచ్చని, తద్వారా ప్రపంచపటంలో దేశం అగ్రగామిగా నిలుస్తుందని నరసింహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ మూడు భాషలను ప్యాకేజీగా పిల్లలకు అందించాలని సూచించారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదని, మాతృభాష ఆధారంగా ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని చెప్పారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్‌కు ప్రముఖ స్థానం ఉందని, అనేక ప్రాంతీయ భాషలున్న దేశంలో.. వీటన్నింటికీ ఇంగ్లిష్ అనుసంధాన భాషగా మారిందన్నారు. విద్యార్థుల జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయునిదే కీలక స్థానమని, అలాంటి ఉపాధ్యాయుడికి అత్యుత్తమ నైపుణ్యాలు ఉండాలని దిశానిర్దేశం చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా..
దేశంలో ప్రతిష్టాత్మక వర్సిటీలకు కొదవలేదని, ఆ స్థాయిలో విద్యార్థులకు ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు ఉండాలని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ అభిప్రాయపడ్డారు. దేశంలో 70 శాతం ఉన్న యువతకు ఇంగ్లిష్ భాషలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఇఫ్లూ వీసీ సునయన సింగ్ పేర్కొన్నారు. బ్రిటిష్ కౌన్సిల్ ద్వారా అత్యుత్తమ నాణ్యతగల ఇంగ్లిష్ భాషను అందిస్తున్నామని బ్రిటిష్ సౌత్ ఏషియా డెరైక్టర్ క్రిస్ బ్రాండ్‌ఉడ్ చెప్పారు. బ్రిటిష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డెరైక్టర్ మి-క్వి బార్కర్, ఇఫ్లూ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ స్కూల్ డీన్ ప్రొఫెసర్ మోహన్‌రాజ్ మాట్లాడారు. ఈ సదస్సుకు 30 దేశాల నుంచి వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. మార్చి 1 వరకు కొనసాగే ఈ సదస్సులో నాణ్యమైన బోధన, స్పీకింగ్ స్కిల్స్, టీచర్ ఎడ్యుకేషన్ అంశాలపై చర్చిస్తారు.