టూరిజానికి పారిస్ కన్నా అది మిన్న!
వాషింగ్టన్: ప్రపంచంలో అత్యుత్తమ టూరిజం స్పాట్ ఏదన్న అంశంపై యూఎస్ ట్రావెల్ సైట్ నిర్వహించిన సర్వేలో ఆస్ట్రేలియాలోని క్విన్స్లాండ్ తీరంలో ఉన్న గ్రేట్ బారియర్ రీఫ్ ప్రధమ స్థానంలో నిలిచింది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్స్ 2016-17 సంవత్సరానికి గాను వెల్లడించిన ఈ ఫలితాల్లో పారిస్, బోర బొరాలను వెనక్కినెట్టి మరీ గ్రేట్ బారియర్ రీఫ్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. వరల్డ్ టూరిస్ట్లు ఒక్కసారైన చూడాల్సిన ప్రదేశం ఈ కొరల్ రీఫ్స్ అని న్యూస్ కార్ప్ మీడియా సంస్థ వెల్లడించింది.
దీనిపై క్వీన్స్లాండ్ టూరిజం అండ్ ఈవెంట్స్ చీఫ్ లియానె మాట్లాడుతూ.. గ్రేట్ బారియర్ రీఫ్కు ఫస్ట్ ప్లేస్ దక్కడం ప్రపంచ టూరిజంలో దాని ప్రాముఖ్యతను సూచిస్తుందన్నారు. క్వీన్స్లాండ్ పర్యాటకులకు గ్రేట్ బారియర్ రీఫ్ ఒక 'లివింగ్ ట్రెజర్' అని ఆమె తెలిపారు. ఆస్ట్రేలియన్ ఎకానమీకి ఈ రీఫ్ ద్వారా ఏటా 5.2 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆమె తెలిపారు. ప్రతీఏటా దీనిని 1.9 మిలియన్ల పర్యాటకులు సందర్శిస్తున్నారని లియానె వెల్లడించారు.