నర్సులు, సెకండరీ టీచర్లకూ డిమాండ్
తగ్గిపోనున్న క్యాషియర్లు, క్లర్క్ పోస్టులు
2030కి 7.8 కోట్ల మందికి కొత్తగా ఉపాధి
డబ్ల్యూఈఎఫ్ 2025 నివేదిక విడుదల
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ, నిర్మాణ కూలీలు, డ్రైవర్ల ఉద్యోగాలు (డెలివరీ రంగాల్లో) గణనీయంగా పెరగనున్నట్టు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) తెలిపింది. అదే సమయంలో క్యాషియర్లు, టికెట్ క్లర్క్‌ల ఉద్యోగాలు పెద్ద ఎత్తున తగ్గిపోతాయని అంచనా వేసింది. ఈ నెల 20 నుంచి డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సు జరగనుండగా, దీనికంటే ముందు ‘ఉద్యోగాల భవిష్యత్, 2025’ పేరుతో నివేదికను విడుదల చేసింది.
2030 నాటికి 17 కోట్ల ఉద్యోగాలు కొత్తగా అందుబాటులోకి వస్తాయని, ఇందులో 9.2 కోట్ల ఉద్యోగాలకు స్థానచలనం ఉంటుందని అంచనా వేసింది. అంటే 7.8 కోట్ల మందికి నికరంగా కొత్తగా ఉపాధి లభించనుంది. అత్యాధునిక టెక్నాలజీలు, భౌగోళిక పరమైన మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఒత్తిళ్లు ఈ మార్పులను నడిపిస్తాయంటూ, పరిశ్రమలు, వృత్తుల ముఖచిత్రం మారిపోనుందని అంచనా వేసింది.
ఏఐ, బిగ్‌డేటాకు భారీ డిమాండ్
కృత్రిమ మేధ (ఏఐ), బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీకు వేగవంతమైన వృద్ధితోపాటు, డిమాండ్ ఉంటుందని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. అదే సమయంలో మానవ నైపుణ్యాలైన సృజనాత్మకత, చురుకుదనం, బలమైన దృక్పథం ఇక ముందూ కీలకమని పేర్కొంది. 1,000 కంపెనీలకు సంబంధించిన డేటాను విశ్లేషించగా, వ్యాపారాల నవీకరణకు నైపుణ్యాల అంతరం పెద్ద అవరోధంగా ఉన్నట్టు గుర్తించింది.
ఉద్యోగాలకు సంబంధించి 40 శాతం నైపుణ్యాలు మారిపోనున్నాయని, 63 శాతం సంస్థలు ఇప్పటికే నైపుణ్యాల అంతరాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. జెనరేటివ్ ఏఐ, వేగంగా మారిపోయే టెక్నాలజీలు పరిశ్రమలకు, ఉపాధి మార్కెట్‌కు గణనీయమైన అవకాశాలను తీసుకురావడమే కాకుండా, పెద్ద ఎత్తున రిస్క్ కూడా మోసుకొస్తాయని డబ్ల్యూఈఎఫ్ ‘ఉపాధి కల్పన’ విభాగం హెడ్ టిల్ లియోపోల్డ్ అన్నారు.
సంరక్షణ ఉద్యోగాలైన నర్సులు, సెకండరీ స్కూల్ టీచర్ల ఉద్యోగాలు కూడా గణనీయంగా పెరొగొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఏఐ వినియోగం ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను గణనీయంగా మార్చివేయనుందని, దాదాపు సగం సంస్థలు ఏఐతో కొత్త అవకాశాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. ముఖ్యంగా ఏఐ సాయంతో తమ సిబ్బందిని తగ్గించుకోవాలని 41 శాతం సంస్థలు భావిస్తున్నట్టు పేర్కొంది. మరో 77 శాతం సంస్థలు తమ సిబ్బందికి నైపుణ్యాల పెంపుపై శిక్షణ ఇప్పించే యోచనతో ఉన్నట్టు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment