వర్టికల్ ఫార్మింగ్ (నిట్టనిలువు సాగు)
ప్రపంచంలో అన్నీ మారిపోతున్నాయి. వెళ్లే కార్లు మొన్నటి మాదిరిగా లేవు. నడిచే రోడ్లు, ఉండే ఇళ్లు కూడా గతంలోలా లేవు. తాజాగా ఈ జాబితాలోకి వ్యవసాయం కూడా చేరిపోతోంది! నిన్న మొన్నటి దాకా గ్రీన్‌హౌస్ వ్యవసాయంపై బోలెడన్ని వార్తలు వచ్చేవి. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. వర్టికల్ ఫార్మింగ్‌దే హవా. ఫొటోలో కనిపిస్తున్న సోలార్ ప్యానెళ్లను చూశారుగా.. ఇవి కూడా ఓ వర్టికల్ ఫార్మ్‌వే. అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని బ్రదర్లీ లవ్ భవనంలో ఏర్పాటైంది ఈ నిట్టనిలువు వ్యవసాయ క్షేత్రం. మెట్రోపోలిస్ ఫార్మ్ పేరుతో ఏర్పాటైన ఈ క్షేత్రం విస్తీర్ణం 2.2 ఎకరాలు మాత్రమే కానీ... 660 ఎకరాల సాధారణ నేలలో పండించేంత మోతాదులో పంటలు పండుతాయి ఇక్కడ.
అబ్బో అదెలా సాధ్యమంటే... అంతా టెక్నాలజీ మహిమ అంటున్నారు మెట్రోపోలిస్ ఫార్మ్ యజమానులు. ఒకదానిపై ఒకటి ఉంచే అరల్లో పంటలు పండుతాయి. సూర్యరశ్మి స్థానంలో ఎల్‌ఈడీ బల్బుల వెలుగులు మొక్కలకు అవసరమైన శక్తిని అందిస్తాయి. ఇలాంటి నిట్టనిలువు వ్యవసాయం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. నీటిని అత్యంత పొదుపుగా సమర్థంగా వాడుకోవడం ఒకటైతే.. క్రిమికీటకాల బెడద అస్సలు ఉండదు కాబట్టి అందుకు తగ్గట్టుగానే ఎరువులు, కీటకనాశినుల వాడకం కూడా అవసరముండదు. ఎల్‌ఈడీ బల్బుల కోసం.. ఇతర అవసరాలన్నింటి కోసం భవనం పైకప్పుపై దాదాపు 2003 సోలార్ ప్యానెళ్లతో 500 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.
వర్టికల్ ఫార్మింగ్‌కు సూర్యరశ్మిని అందించే సోలార్ ప్యానెళ్లు
ఇప్పటివరకూ ఏర్పాటైన అనేక వర్టికల్ ఫార్మ్‌లకు దీనికీ ఇంకో ప్రధానమైన తేడా ఉంది. తక్కిన వాటిల్లో కేవలం ఆకుకూరలు మాత్రమే పండేవి. కానీ తాము టెక్నాలజీలో కొన్ని మార్పులు చేయడం ద్వారా దాదాపు అన్ని రకాల పంటలూ పండించగలుగుతున్నామని అంటున్నారు మెట్రోపోలిస్ ఫార్మ్ యజమానులు. టమోటాలు, స్ట్రాబెర్రీలు, దోసకాయలతోపాటు వీరు ఆకుకూరలు కూడా పండిస్తున్నారు.! నగరం నడిబొడ్డున 660 ఎకరాలకు సరిపడా పంట పండితే.. కాయగూరలను పల్లెల నుంచి నగరాలకు తీసుకు రావాల్సిన అవసరం తప్పుతుంది కాబట్టి అంతమేరకు ఆదా చేయవచ్చునన్నది వీరి ఆలోచన.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment