‘గ్రీన్‌హౌస్’కు దరఖాస్తుల వెల్లువ
- ఒక్క మెదక్ జిల్లా నుంచే 600
- నేడు కంపెనీలతో ఉద్యానశాఖ ఒప్పందం!
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 75 శాతం సబ్సిడీ ఉండటంతో పెద్ద రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఉద్యాన శాఖ ప్రకటించిన వెంటనే దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల పరిధిలోని ఆరు జిల్లాల నుంచి రైతులు ఉద్యాన శాఖను సంప్రదిస్తున్నారు. ఒక్క మెదక్ జిల్లా నుంచే 600 దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 400, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 350 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
మిగిలిన జిల్లాల్లోనూ రైతులు ముందుకొస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీతో వెయ్యి ఎకరాల్లో మాత్రమే గ్రీన్‌హౌస్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వస్తున్న దరఖాస్తులను బట్టి నిర్ణీత పరిధి దాటే అవకాశముందని ఉద్యానశాఖ అధికారులంటున్నారు. నేల స్వభావం, నీటివసతి అం శాలు పరిశీలించాక, అనుమతినిస్తామని పేర్కొం టున్నారు. మరోవైపు గ్రీన్‌హౌస్ చేపట్టే కంపెనీలతో నేడు ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.
ఐటీ శాఖను సంప్రదించనున్న అధికారులు
గ్రీన్‌హౌస్ నిర్మాణానికి ఎకరాకు రూ. 39.36 లక్షలు వ్యయం కానుంది. అందులో ప్రభుత్వం 75 శాతం చొప్పున రూ. 29.52 లక్షలు సబ్సిడీ ఇవ్వనుంది. రైతు ముందుగా రూ. 9.84 లక్షలు (25 శాతం) చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలో రైతులు ఆదాయ పన్ను వివరాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయమై ఆదాయపన్ను శాఖతో సంప్రదించాలని యోచిస్తున్నారు.