బొమ్మలు కొన్నట్లు తుపాకులు కొనేసుకుంటున్నారు..
ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా గన్ కల్చరే కనిపిస్తోంది. షాపింగ్ మాల్స్ లో ఆటబొమ్మలు కొన్నట్లుగా తుపాకులను కొనేసుకుంటున్నారు. టెక్సాస్ నుంచి మైన్ వరకు తుపాకీ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. చేతిలో గన్ లేకుండా కాలు బయట పెట్టేందుకూ ఇప్పుడు అమెరికన్లు ఆలోచిస్తున్నారు. చివరకు తుపాకీ పేల్చడంలో శిక్షణ కూడ తీసుకుంటున్నారు. ఆత్మరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న అమెరికన్లు తుపాకీలు కొనేందుకు క్యూ కడుతున్నారు. ఉగ్ర భయం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో... ఆందోళన చెందుతున్న జనం... ప్రాణ రక్షణ కోసం తుపాకులను ఆశ్రయిస్తున్నారు. దీంతో అక్కడ రికార్డు స్థాయిలో గన్ సేల్స్ పెరిగిపోయింది.
ముఖ్యంగా 2015 ఫెడరల్ డేటా ప్రకారం చూస్తే అమెరికాలో తుపాకీ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఫెడరల్ బ్యాగ్రౌండ్ చెక్ సిస్టమ్ ప్రారంభమైన 1998 నుంచి పరిశీలిస్తే... 23.1 మిలియన్లకు చేరిన కొనుగోళ్ళు.. గత సంవత్సరం అత్యధిక సంఖ్యలో సుమారు పది శాతం పెరిగాయి. 2015 బ్లాక్ ఫ్రైడే సందర్భంగా జరిగే అమ్మకాలతో పోలిస్తే... ఈసారి అత్యధిక సంఖ్యలో తుపాకీ కొనుగోళ్ళుపెరిగాయి. దీంతో బ్లాక్ ఫ్రైడే.. గన్స్ సేల్స్ డే గా పరిణమించింది. సంవత్సరాంతంలో శాన్ బెర్నార్డినో కాల్పుల అనంతరం.. హింసను అరికట్టేందుకు అధ్యక్షుడు ఒబామా తుపాకీ అమ్మకాలపై పరిమితులు విధిస్తూ ఓ ప్యాకేజీని కూడ ప్రవేశ పెట్టారు. అయితే ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రికార్డులకు, తుపాకీల అమ్మకాలకు సరిపోలడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఉన్న పరిమితులను బట్టి ఒక్కోలా అమ్మకాలు జరుగుతున్నాయి.
మొత్తంగా చూస్తే ఎఫ్బీఐ రికార్డులు మాత్రం 2015 లో తుపాకీల లావాదేవీలు అత్యధిక స్థాయిలో పెరిగినట్లు చెప్తోంది. అంతేకాక సామాజిక సర్వేల్లో కూడా గత సంవత్సరం ఆల్కహాల్, టుబాకో, విస్ఫోటనాలు, మందుగుండు సామగ్రి పరిశ్రమల అభివృద్ధితో పోలిస్తే ఎక్కువగా తుపాకీల పరిశ్రమల అభివృద్ధే పెరిగినట్లు తేలింది. మొదటిసారి తుపాకులను కొనేవారి కంటే యజమానులు మరిన్ని తుపాకులను కొని తమ ముందు తరాల వారికోసం నిల్వ చేసుకోవడం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే కొత్త పరిమితుల అమలు నేపథ్యంలో ఈ రికార్డు స్థాయి తుపాకీల అమ్మకాలు జనవరితో ముగిసే అవకాశం కనిపిస్తోంది.