9మందిని హతమార్చిన ఉగ్రవాదులు?
మాలి: మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో 170మందిని బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు... వారిలో 9మందిని హతమార్చినట్లు సమాచారం. మృతుల్లో ఐక్యరాజ్యసమితి సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఫ్రెంచ్, బెల్జియం దేశస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా ఓ ఫ్రెంచ్ దేశస్తుడు సహా ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.
సుమారు 10మంది ఉగ్రవాదులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలతో హోటల్ లోకి చొరబడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించేందుకు భద్రతా దళాలు యత్నిస్తున్నాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా హోటల్ సమీపంలో పేలుడు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు స్థానిక మీడియాకు తెలిపారు. మరోవైపు మాలి ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.