Bamako
-
Bamako: మాలిలో ఘోర బస్సు ప్రమాదం
బమాకో: పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 31 మంది మరణించారు. మంగళవారం రాత్రి కెనీబా పట్టణంలో బ్రిడ్జిపై నుంచి వెళుతున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు బుర్కినా ఫాసోకు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చనిపోయిన వారిలో మాలి పౌరులతో పాటు ఇతరులు కూడా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ ఆఫ్రికాలో ప్రజా రవాణాలో ఏ మాత్రం ప్రమాణాలు ఉండవు. బస్సులు, రైళ్లు కిక్కిరిసి వెళుతుంటాయి. దీంతో ఇక్కడ ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. ఇదీ చదవండి.. రష్యా హక్కుల నేతకు 30 నెలల జైలు -
రగులుతున్న ‘మాలి'
-
'రగులుతున్న మాలి'
బొమాకో : సైనికుల తిరుగుబాటుతో మాలి దేశం అట్టుడుకుతుంది. దీంతో మాలి దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతా బుధవారం తెల్లవారుజామున తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో గతకొతకాలంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మాలిలో రక్తం పారవద్దనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కాగా ఆయన పదవీకాలం ఇంకా మూడేళ్ల పాటు ఉంది. అధ్యక్షుడి రాజీనామా అనంతరం మాలీ పార్లమెంట్ రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కీతా రెండోసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. కానీ అవినీతి, ఆర్థికవ్యవస్థను చక్కదిద్దకపోవడం, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మత హింసపై ప్రజల్లో ఆగ్రహం ఉంది.ఇస్లాం తిరుగుబాటును బౌబాకర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో రెండు నెలలుగా మాలిలో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.మితవాద మత పెద్ద మహమూద్ డికో నేతృత్వంలో ఏర్పడిన ఒక కొత్త ప్రతిపక్ష కూటమిని ప్రభుత్వంలో కలవాలంటూ కీతా చేసిన ప్రతిపాదనను ఆ కూటమి తిరస్కరించింది. దేశంలో సంస్కరణలకు పిలుపునిచ్చింది. కాగా తిరుగుబాటు చేసిన సైనికులు కీతా క్యాంపులో ఉన్న ఇబ్రహీం బౌబాకర్తో పాటు ప్రధాని బౌబౌ సిస్సేను తమ అధీనంలోకి తీసుకున్నారు. అంతకుముందు విజయ సూచకంగా అతని ఇంటి బయట గాలిలోకి కాల్పులు జరిపారు. తిరుగుబాటు సైనికులతోపాటు, ప్రజలు కూడా భారీగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతూ రాజధాని నగరం బొమాకోను తమ ఆధీనంలోకి తీసకున్నారు. -
ఉగ్రదాడిలో 35మంది జవాన్ల మృతి
బమాకో (మాలి) : వైశాల్యపరంగా ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా పిలవబడుతున్న మాలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. మాలిలోని మేనక ఔట్‌పోస్టు ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారుగా 35 మంది సైనికులు మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా అనేక మంది సైనికులు మరణించారు. ఇటీవలే ఓ నెల రోజుల క్రితం బుర్కినో ఫాసోలో ఇద్దరు జిహాదీలు చేసిన దాడిలో సుమారు 40 మంది సైనికులు మృతిచెందారు. అయితే శుక్రవారం జరిగిన దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత ప్రకటించలేదు. ఉత్తర మాలి ప్రాంతంలో ఆల్ ఖైదా ఉగ్రవాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయితే ఫ్రెంచ్ దళాలు చేపట్టిన ఆపరేషన్‌తో ఉగ్రవాదులు ప్రతిదాడులకు దిగుతున్నారు. 2016లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 2018లో 40మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2015లో మాలి రాజధాని బమాకో నగరం మధ్య ఉన్న రాడిసన్ బ్లూ హోటల్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు 18మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. -
ఉగ్ర పంజా
- మాలి రాజధాని బమాకోలోని ఓ హోటల్‌పై దాడి - ఉగ్రవాదుల కాల్పుల్లో కనీసం 27 మంది మృతి! - బందీల్లో 20 మంది భారతీయులు; అంతా క్షేమంగా విడుదల - 9 గంటల ఆపరేషన్ అనంతరం ముష్కరులను హతమార్చిన సాయుధ దళాలు బమాకో: పారిస్‌లో ఉగ్రవాదుల దాడిలో పారిన నెత్తుటి మరకలు ఆరకముందే.. ఆఫ్రికా దేశం మాలిలో సాయుధ ఇస్లామిక్ తీవ్రవాదులు మరో నరమేథానికి తెగించారు. మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్‌పై దాడి చేసి, 170 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆ సాయుధుల కాల్పుల్లో బందీల్లోని 27 మంది ప్రాణాలు కోల్పోయారు. హోటల్లోకి శుక్రవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలు) దౌత్యవేత్తలు ఉపయోగించే కార్లకుండే నెంబర్ప్లేట్తో ఉన్న కారులో దూసుకువచ్చిన సాయుధులు అక్కడి సెక్యూరిటీ గార్డులపై ఆటోమేటిక్ తుపాకులు, గ్రెనేడ్లతో విరుచుకుపడ్డారు. హోటల్‌ను స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న 140 మంది అతిధులను, 30 మంది సిబ్బందిని చెరబట్టారు. దాడి సమాచారం అందిన వెంటనే మాలి పోలీసులు, రక్షణ బృందాలు హుటాహుటిన హోటల్ వద్దకు చేరుకున్నాయి. హోటల్‌ను చుట్టుముట్టి, అత్యాధునిక ఆయుధాలతో హోటల్లోకి ప్రవేశించి, ఒక్కో అంతస్తులోకి చేరుతూ, బందీలను విడిపించే పని ప్రారంభించాయి. మిలటరీ హెలీకాప్టర్‌ను కూడా రంగంలోకి దింపారు. దాదాపు 9 గంటల అనంతరం దాడికి పాల్పడిన ఇద్దరు సాయుధులను హతమార్చి, ఈ సంక్షోభానికి తెరదించామని మాలి అంతర్గత భద్రత మంత్రి సాలిఫ్ ట్రావోర్ ప్రకటించారు. బందీలందరినీ విడిపించామన్నారు. ఐరాస శాంతి పరిరక్షక దళ సభ్యులు, ఫ్రాన్స్ దళాలు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఒక సదస్సులో పాల్గొనేందుకు చాద్ వెళ్లిన మాలి అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీతా.. దాడి విషయం తెలియగానే స్వదేశానికి తిరుగుప్రయాణమయ్యారు. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టడంలో సమర్ధత, నిపుణత కలిగిన పారా మిలటరీ బృందాన్ని ఫ్రాన్స్ మాలికి పంపించింది. ‘ఇలాంటి క్లిష్ట సమయంలో మా మిత్ర దేశానికి సహకరించడం మా విధి’ అని ఫ్రాన్స్ పేర్కొంది. ఉగ్ర దాడి నేపథ్యంలో మాలిలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మలేసియా పర్యటనలో ఉన్నారు. అమెరికా పౌరులు కూడా బందీలుగా ఉండొచ్చని భావిస్తున్నామని అమెరికా హోంశాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. మాలిలోని అమెరికన్లంతా ఎక్కడివారక్కడే ఉండాలని సూచించారు. సాయుధుల దాడి సమయంలో హోటల్ వద్ద భీతావహ పరిస్థితి నెలకొంది. ఒక శ్వేత జాతీయుడు గాయాలతో హోటల్ లాబీలో పడిపోయి ఉన్నాడని దాడి నుంచి తప్పించుకున్న ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న ఒక పోలీస్ అధికారిని ఆసుపత్రికి తరలించారు. బందీలుగా చిక్కినవారిలో కొందరిని ఆ సాయుధులే విడిచిపెట్టగా, మరికొందరు తప్పించుకున్నారు. 20 మంది భారతీయులు బందీల్లో 20 మంది భారతీయులున్నారు. వారు దుబాయికి చెందిన ఒక కంపెనీ తరఫున మాలిలో పనిచేస్తూ ఆ హోటల్లోనే ఉంటున్నారు. వారందరినీ క్షేమంగా విడిపించామని, ఈ విషయాన్ని మాలిలోని భారతీయ దౌత్యాధికారి ధ్రువీకరించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. బందీల్లో ఏడుగురు చైనీయులున్నారని చైనా అధికార వార్తాసంస్థ ప్రకటించింది. తమ ఉద్యోగులు ఆరుగురు కూడా అదే హోటల్లో ఉన్నారని టర్కీ విమానయాన సంస్థ వెల్లడించింది. దాడికి పాల్పడింది ఎవరు? దాడికి బాధ్యత వహిస్తూ ఏ సంస్థా ప్రకటన చేయలేదు. అయితే, వారు జీహాదీలేనని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కొంతమంది బందీలను బయటకు పంపేముందు వారితో పవిత్ర ఖురాన్ పంక్తులను చదివిస్తున్నారని తెలిపారు. అంతకుముందు, 10 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారని మాలి సైనిక కమాండర్ మొడిబొ నామా ట్రావోర్ తెలిపారు. వారితో మాట్లాడటానికి భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. మరోవైపు, ఈ దాడిలో ఇద్దరే పాల్గొన్నారని రాడిసన్ బ్లూ హోటల్‌ను నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన రెజిడార్ హోటల్ గ్రూప్ పేర్కొంది. తమకందిన సమాచారం మేరకు ఇద్దరు ఈ దాడికి పాల్పడ్డారని తెలిపింది. రాడిసన్ బ్లూ బమాకోలోని ప్రముఖ హోటల్. ఇందులో 190 గదులున్నాయి. మాలిలో జరిగే అనేక అధికారిక, అనధికారిక కార్యక్రమాలు ఇందులోనే జరుగుతాయి. అయితే, ఆ హోటల్లో భద్రతా ఏర్పాట్లు అంతంతమాత్రంగానే ఉంటాయని అందులో తరచుగా బసచేసే ఒక ఫ్రెంచ్ కన్సల్టెంట్ చెప్పారు. గతంలోనూ.. ఆగస్ట్‌లోనూ మాలిలోని సెవరె పట్టణంలోని ఓ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో.. ఆ టైస్టులతో పాటు ఐదుగురు ఐరాస ఉద్యోగులు, నలుగురు సైనికులు మరణించారు. మార్చిలో బొమాకోలోని ఓ రెస్టారెంట్లో జరిగిన ఉగ్రదాడిలో ఒక ఫ్రెంచ్, ఒక బెల్జియన్ సహా ఐదుగురు చనిపోయారు. 2012లో అల్‌కాయిదా అనుబంధ సంస్థ దాదాపు ఉత్తర మాలినంతటిని స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత 2013 జనవరిలో ఫ్రాన్స్ నేతృత్వంలో సైనిక చర్య జరిపి ఆ ప్రాంతం నుంచి వారిని తరిమికొట్టారు. మాజీ తారెగ్ తిరుగుబాటుదారులు, ప్రభుత్వ అనుకూల సాయుధ సంస్థల మధ్య ఈ జూన్‌లో శాంతి ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ, సమయం చిక్కిన ప్రతీసారి ఇస్లామిక్ గ్రూపులు మాలిలో దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మాలిలోని చాలా ప్రాంతాలు ప్రభుత్వ నియంత్రణలో లేవు. ఇటీవలే ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ శాంతి ఒప్పందాన్ని తిరస్కరిస్తూ.. ఫ్రాన్స్‌లో, మాలిలో దాడులకు తెగబడ్తామని హెచ్చరించింది. తమపై దాడులు చేస్తున్న ఫ్రాన్స్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంది. పారిస్ దాడుల నేపథ్యంలో పాస్‌పోర్ట్ లేకుండా ప్రయాణించడానికి వీలున్న సభ్యదేశాల సరిహద్దుల్లో తనిఖీని ముమ్మరం చేయాలని శుక్రవారం యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. -
మాలి దాడుల వెనక....
బమాకా: ఆఫ్రికా దేశమైన మాలి గత మూడేళ్లుగా టెర్రరిజంతో అల్లాడిపోతోంది. 2012లో అప్పటి మాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాటు టెర్రరిజానికి దారి తీసింది. నేడు ఇప్పుడది దేశవ్యాప్తంగా విస్తరించి ప్రజలను భయకంపితులను చేస్తోంది. త్వారెగ్ సంచార తెగకు చెందిన తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదట తిరుగుబాటు చేశారు. మాజీ లిబియన్ సైనికులతో ఏర్పడిన 'నేషనల్ మూవ్మెంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ అజావద్ (ఎంఎన్ఎల్ఏ)' ఆ తిరుగుబాటుకు మద్దతిచ్చింది. మాలి ఉత్తర భాగంలోని అజావద్ ప్రాంతాన్ని ఎంఎన్ఎల్ఏ తిరుగుబాటుదారులు ఆక్రమించుకొని స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించారు. మాలిలో షరియా చట్టాన్ని అమలు చేయడం కోసం మాలి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో తిరుగుబాటుదారులకు ముస్లిం తీవ్రవాదులైన అన్సర్ థైస్, అల్ కాయిదా గ్రూపులు కూడా మద్దతిచ్చాయి. ముస్లిం తీవ్రవాదులను అణచివేతకు 2013, జనవరి నెలలో ఫ్రెంచ్ సైన్యం 'సర్వల్' పేరిట ఓ ఆపరేషన్ నిర్వహించింది. అప్పటికే మాలి ఉత్తరాది ప్రాంతాలను ఆక్రమించుకున్న ఇస్లాం తీవ్రవాదులు దక్షిణ ప్రాంతాలను కూడా ఆక్రమించుకునే ఉద్దేశంతో టెర్రరిస్టు దాడులకు పాల్పడుతూ వస్తున్నారు. గత మార్చి 6వ తేదీన ఇస్లామిక్ తీవ్రవాదులు దేశ రాజధాని బమాకాలోని ఓ రెస్టారెంట్‌పై దాడి చేసి ఐదుగురిని కాల్చి చంపారు. మృతుల్లో ఇద్దరు యూరోపియన్లు కూడా ఉన్నారు. ఇస్లామిక్ తీవ్రవాదులు దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ముఖ్యమంగా ఉత్తరాదిలో దాడులకు పాల్పడవచ్చంటూ మాలి విదేశాంగ కార్యాలయం దేశ ప్రజలను, ముఖ్యంగా విదేశీ పర్యాటకులను హెచ్చరిస్తూ వస్తోంది. శుక్రవారంనాడు రాడిసన్ బ్లూ హోటల్లోకి ముస్లిం మిలిటెంట్లు జొరబడి ప్రజలపై కాల్పులు జరపడం ఆ తరహా దాడిగానే కనిపిస్తోంది. మాలి ప్రజలకు రక్షణ కల్పించడం కోసం ఐక్యరాజ్య సమితి తరఫున 12వేల మంది సైనికులు మాలికి రక్షణ కల్పిస్తున్నారు. -
9మందిని హతమార్చిన ఉగ్రవాదులు?
-
9మందిని హతమార్చిన ఉగ్రవాదులు?
మాలి: మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్లో 170మందిని బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు... వారిలో 9మందిని హతమార్చినట్లు సమాచారం. మృతుల్లో ఐక్యరాజ్యసమితి సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఫ్రెంచ్, బెల్జియం దేశస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా ఓ ఫ్రెంచ్ దేశస్తుడు సహా ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. సుమారు 10మంది ఉగ్రవాదులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలతో హోటల్ లోకి చొరబడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించేందుకు భద్రతా దళాలు యత్నిస్తున్నాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా హోటల్ సమీపంలో పేలుడు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు స్థానిక మీడియాకు తెలిపారు. మరోవైపు మాలి ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాలిలో పారిస్ తరహా దాడి!
-
మాలిలో పారిస్ తరహా దాడి!
మాలి : ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పారిస్‌పై నరమేథాన్ని మరువకముందే పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీలోనూ బరితెగించారు. మాలి రాజధాని బమాకోలో పారిస్ తరహా దాడులకు పాల్పడ్డారు. బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్‌పై 10మంది ఆగంతకులు విరుచుకుపడ్డారు. హోటల్లో ఉన్న170మందిని బందీలుగా చేసుకున్నారు. బందీల్లో ఎక్కువమంది అమెరికా, బ్రిటిష్ టూరిస్టులున్నారు. ఉగ్రవాదుల చెరలో 170మంది ఉండగా, వారిలో 140మంది అతిథులు కాగా, 30 మంది హోటల్ సిబ్బంది ఉన్నారు. మరోవైపు భద్రతాదళాలు హోటలును చుట్టుముట్టాయి. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థులు ఉన్నట్లు సమాచారం. కాగా గత ఆగస్టులోనూ మాలిలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో మొత్తం తొమ్మిదిమంది మరణించారు.