ఉగ్ర పంజా | terror attack in mali, 27 died | Sakshi
Sakshi News home page

ఉగ్ర పంజా

Published Sat, Nov 21 2015 2:26 AM | Last Updated on Sat, Aug 11 2018 8:07 PM

ఉగ్ర పంజా - Sakshi

ఉగ్ర పంజా

- మాలి రాజధాని బమాకోలోని ఓ హోటల్‌పై దాడి

- ఉగ్రవాదుల కాల్పుల్లో కనీసం 27 మంది మృతి!

- బందీల్లో 20 మంది భారతీయులు; అంతా క్షేమంగా విడుదల

- 9 గంటల ఆపరేషన్ అనంతరం ముష్కరులను హతమార్చిన సాయుధ దళాలు

 

బమాకో: పారిస్‌లో ఉగ్రవాదుల దాడిలో పారిన నెత్తుటి మరకలు ఆరకముందే.. ఆఫ్రికా దేశం మాలిలో సాయుధ ఇస్లామిక్ తీవ్రవాదులు మరో నరమేథానికి తెగించారు. మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్‌పై దాడి చేసి, 170 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆ సాయుధుల కాల్పుల్లో బందీల్లోని 27 మంది ప్రాణాలు కోల్పోయారు. హోటల్‌లోకి శుక్రవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలు) దౌత్యవేత్తలు ఉపయోగించే కార్లకుండే నెంబర్‌ప్లేట్‌తో ఉన్న కారులో దూసుకువచ్చిన సాయుధులు అక్కడి సెక్యూరిటీ గార్డులపై ఆటోమేటిక్ తుపాకులు, గ్రెనేడ్లతో విరుచుకుపడ్డారు. హోటల్‌ను స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న 140 మంది అతిధులను, 30 మంది సిబ్బందిని చెరబట్టారు.

 

దాడి సమాచారం అందిన వెంటనే మాలి పోలీసులు, రక్షణ బృందాలు హుటాహుటిన హోటల్ వద్దకు చేరుకున్నాయి. హోటల్‌ను చుట్టుముట్టి, అత్యాధునిక ఆయుధాలతో హోటల్‌లోకి ప్రవేశించి, ఒక్కో అంతస్తులోకి చేరుతూ, బందీలను విడిపించే పని ప్రారంభించాయి. మిలటరీ హెలీకాప్టర్‌ను కూడా రంగంలోకి దింపారు. దాదాపు 9 గంటల అనంతరం దాడికి పాల్పడిన ఇద్దరు సాయుధులను హతమార్చి, ఈ సంక్షోభానికి తెరదించామని మాలి అంతర్గత భద్రత మంత్రి సాలిఫ్ ట్రావోర్ ప్రకటించారు. బందీలందరినీ విడిపించామన్నారు. ఐరాస శాంతి పరిరక్షక దళ సభ్యులు, ఫ్రాన్స్ దళాలు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఒక సదస్సులో పాల్గొనేందుకు చాద్ వెళ్లిన మాలి అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీతా.. దాడి విషయం తెలియగానే స్వదేశానికి తిరుగుప్రయాణమయ్యారు. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టడంలో సమర్ధత, నిపుణత కలిగిన పారా మిలటరీ బృందాన్ని ఫ్రాన్స్ మాలికి పంపించింది.

 

‘ఇలాంటి క్లిష్ట సమయంలో మా మిత్ర దేశానికి సహకరించడం మా విధి’ అని ఫ్రాన్స్ పేర్కొంది. ఉగ్ర దాడి నేపథ్యంలో మాలిలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మలేసియా పర్యటనలో ఉన్నారు. అమెరికా పౌరులు కూడా బందీలుగా ఉండొచ్చని భావిస్తున్నామని అమెరికా హోంశాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. మాలిలోని అమెరికన్లంతా ఎక్కడివారక్కడే ఉండాలని సూచించారు. సాయుధుల దాడి సమయంలో హోటల్ వద్ద భీతావహ పరిస్థితి నెలకొంది. ఒక శ్వేత జాతీయుడు గాయాలతో హోటల్ లాబీలో పడిపోయి ఉన్నాడని దాడి నుంచి తప్పించుకున్న ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న ఒక పోలీస్ అధికారిని ఆసుపత్రికి తరలించారు. బందీలుగా చిక్కినవారిలో కొందరిని ఆ సాయుధులే విడిచిపెట్టగా, మరికొందరు తప్పించుకున్నారు.

 

20 మంది భారతీయులు

బందీల్లో 20 మంది భారతీయులున్నారు. వారు దుబాయికి చెందిన ఒక కంపెనీ తరఫున మాలిలో పనిచేస్తూ ఆ హోటల్‌లోనే ఉంటున్నారు. వారందరినీ క్షేమంగా విడిపించామని, ఈ విషయాన్ని మాలిలోని భారతీయ దౌత్యాధికారి ధ్రువీకరించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. బందీల్లో ఏడుగురు చైనీయులున్నారని చైనా అధికార వార్తాసంస్థ ప్రకటించింది. తమ ఉద్యోగులు ఆరుగురు కూడా అదే హోటల్లో ఉన్నారని టర్కీ విమానయాన సంస్థ వెల్లడించింది.

 

దాడికి పాల్పడింది ఎవరు?

దాడికి బాధ్యత వహిస్తూ  ఏ సంస్థా ప్రకటన చేయలేదు. అయితే, వారు జీహాదీలేనని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కొంతమంది బందీలను బయటకు పంపేముందు వారితో పవిత్ర ఖురాన్ పంక్తులను చదివిస్తున్నారని తెలిపారు. అంతకుముందు, 10 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారని మాలి సైనిక కమాండర్ మొడిబొ నామా ట్రావోర్ తెలిపారు. వారితో మాట్లాడటానికి భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. మరోవైపు, ఈ దాడిలో ఇద్దరే పాల్గొన్నారని రాడిసన్ బ్లూ హోటల్‌ను నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన రెజిడార్ హోటల్ గ్రూప్ పేర్కొంది. తమకందిన సమాచారం మేరకు ఇద్దరు ఈ దాడికి పాల్పడ్డారని తెలిపింది. రాడిసన్ బ్లూ బమాకోలోని ప్రముఖ హోటల్. ఇందులో 190 గదులున్నాయి. మాలిలో జరిగే అనేక అధికారిక, అనధికారిక కార్యక్రమాలు ఇందులోనే జరుగుతాయి. అయితే, ఆ హోటల్లో భద్రతా ఏర్పాట్లు అంతంతమాత్రంగానే ఉంటాయని అందులో తరచుగా బసచేసే ఒక ఫ్రెంచ్ కన్సల్టెంట్ చెప్పారు.

 

గతంలోనూ..

ఆగస్ట్‌లోనూ మాలిలోని సెవరె పట్టణంలోని ఓ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో.. ఆ టైస్టులతో పాటు ఐదుగురు ఐరాస ఉద్యోగులు, నలుగురు సైనికులు మరణించారు. మార్చిలో బొమాకోలోని ఓ రెస్టారెంట్లో జరిగిన ఉగ్రదాడిలో ఒక ఫ్రెంచ్, ఒక బెల్జియన్ సహా ఐదుగురు చనిపోయారు. 2012లో అల్‌కాయిదా అనుబంధ సంస్థ దాదాపు ఉత్తర మాలినంతటిని స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత 2013 జనవరిలో ఫ్రాన్స్ నేతృత్వంలో సైనిక చర్య జరిపి ఆ ప్రాంతం నుంచి వారిని తరిమికొట్టారు. మాజీ తారెగ్ తిరుగుబాటుదారులు, ప్రభుత్వ అనుకూల సాయుధ సంస్థల మధ్య ఈ జూన్‌లో శాంతి ఒప్పందం కుదిరింది.

 

అయినప్పటికీ, సమయం చిక్కిన ప్రతీసారి ఇస్లామిక్ గ్రూపులు మాలిలో దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మాలిలోని చాలా ప్రాంతాలు ప్రభుత్వ నియంత్రణలో లేవు. ఇటీవలే ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ శాంతి ఒప్పందాన్ని తిరస్కరిస్తూ.. ఫ్రాన్స్‌లో, మాలిలో దాడులకు తెగబడ్తామని హెచ్చరించింది. తమపై దాడులు చేస్తున్న ఫ్రాన్స్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంది. పారిస్ దాడుల నేపథ్యంలో పాస్‌పోర్ట్ లేకుండా ప్రయాణించడానికి వీలున్న సభ్యదేశాల సరిహద్దుల్లో తనిఖీని ముమ్మరం చేయాలని శుక్రవారం యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement