మాలి దాడుల వెనక....
బమాకా: ఆఫ్రికా దేశమైన మాలి గత మూడేళ్లుగా టెర్రరిజంతో అల్లాడిపోతోంది. 2012లో అప్పటి మాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాటు టెర్రరిజానికి దారి తీసింది. నేడు ఇప్పుడది దేశవ్యాప్తంగా విస్తరించి ప్రజలను భయకంపితులను చేస్తోంది. త్వారెగ్ సంచార తెగకు చెందిన తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదట తిరుగుబాటు చేశారు.
మాజీ లిబియన్ సైనికులతో ఏర్పడిన 'నేషనల్ మూవ్మెంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ అజావద్ (ఎంఎన్ఎల్ఏ)' ఆ తిరుగుబాటుకు మద్దతిచ్చింది. మాలి ఉత్తర భాగంలోని అజావద్ ప్రాంతాన్ని ఎంఎన్‌ఎల్‌ఏ తిరుగుబాటుదారులు ఆక్రమించుకొని స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించారు.
మాలిలో షరియా చట్టాన్ని అమలు చేయడం కోసం మాలి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో తిరుగుబాటుదారులకు ముస్లిం తీవ్రవాదులైన అన్సర్ థైస్, అల్ కాయిదా గ్రూపులు కూడా మద్దతిచ్చాయి. ముస్లిం తీవ్రవాదులను అణచివేతకు 2013, జనవరి నెలలో ఫ్రెంచ్ సైన్యం 'సర్వల్' పేరిట ఓ ఆపరేషన్ నిర్వహించింది. అప్పటికే మాలి ఉత్తరాది ప్రాంతాలను ఆక్రమించుకున్న ఇస్లాం తీవ్రవాదులు దక్షిణ ప్రాంతాలను కూడా ఆక్రమించుకునే ఉద్దేశంతో టెర్రరిస్టు దాడులకు పాల్పడుతూ వస్తున్నారు.
గత మార్చి 6వ తేదీన ఇస్లామిక్ తీవ్రవాదులు దేశ రాజధాని బమాకాలోని ఓ రెస్టారెంట్‌పై దాడి చేసి ఐదుగురిని కాల్చి చంపారు. మృతుల్లో ఇద్దరు యూరోపియన్లు కూడా ఉన్నారు. ఇస్లామిక్ తీవ్రవాదులు దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ముఖ్యమంగా ఉత్తరాదిలో దాడులకు పాల్పడవచ్చంటూ మాలి విదేశాంగ కార్యాలయం దేశ ప్రజలను, ముఖ్యంగా విదేశీ పర్యాటకులను హెచ్చరిస్తూ వస్తోంది.
శుక్రవారంనాడు రాడిసన్ బ్లూ హోటల్‌లోకి ముస్లిం మిలిటెంట్లు జొరబడి ప్రజలపై కాల్పులు జరపడం ఆ తరహా దాడిగానే కనిపిస్తోంది. మాలి ప్రజలకు రక్షణ కల్పించడం కోసం ఐక్యరాజ్య సమితి తరఫున 12వేల మంది సైనికులు మాలికి రక్షణ కల్పిస్తున్నారు.