చేతికి బేడీలతో లవ్ ప్రపోజల్.. వీడియో వైరల్
వాషింగ్టన్: ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో స్టైల్ ఉంటుంది. లవర్ పుట్టినరోజు కొందరు, వారికి ఇష్టమైన ప్రదేశంలో మరికొందరు ఇలా రకరకాలుగా ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఓ ప్రేమికుడు పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో వారిని కాస్త సమయం అడిగి మరీ ప్రియురాలికి తాపీగా ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమెరికాలోని ఓక్లహామాకు చెందిన బ్రెండన్ థాంప్సన్ ఈ జూలై 4న అరెస్టయ్యాడు. ఓ కేసులో నిందితుడిగా అనుమానిస్తూ థాంప్సన్ బర్త్‌డే రోజే పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు ఇంటికి వచ్చారు. పోలీసులు ఆ ప్రియుడి చేతికి బేడీలు కూడా వేశారు. పోలీసు వాహనం ఎక్కేముందు అధికారులకు ఓ విజ్ఞప్తి చేశాడు. తనకు ఓ 5 నిమిషాల సమయం కావాలని ఇది తన జీవితంలో ముఖ్యమైన క్షణాలన్నాడు. వెంటనే గాళ్‌ఫ్రెండ్ లియాండ్రా కీత్ వద్దకు వెళ్లి తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. 'నేను నిన్ను పెళ్లి సుకోవాలి అనుకుంటున్నాను. ఇక జీవితాంతం నీకు తోడుగా ఉంటానని' థాంప్సన్ చేసిన ప్రపోజల్‌కు ప్రేయసి లియాండ్రా ఓకే చెప్పేసింది.
ఓ వైపు చేతులకు బేడీలతో ఉన్నా.. మోకాళ్లపై నిల్చుని ప్రియురాలు లియాండ్రాకు థాంప్సన్ చేసిన లవ్ ప్రపోజల్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రేయసి వేలికి ఉంగరం తొడిగిన థాంప్సన్.. అక్కడి నుంచి కదిలేలోపు లియాండ్రా సాయంతో తాపీగా సిగరెట్ కూడా కాల్చాడు. ఇంట్లోవాళ్లకు ఏదో చెబుతూ.. సంతోషంగా జైలు బాట పట్టాడు ఆ ప్రేమికుడు. బాబ్ లించ్ అనే పోలీసు అధికారి ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అనూహ్యమైన స్పందన వస్తోంది.