న్యూయార్క్ : కరోనా మహమ్మారి చికిత్సలో మలేరియాకు వాడే హ్రైడాక్సీక్లోరోక్వీన్ బాగా పనిచేస్తుందన్న ప్రచారంలో పసలేదని వెల్లడైంది. ప్రామాణిక వైద్య చికిత్సతో పోలిస్తే ఈ మందు ప్రభావం పరిమితమే కాకుండా ప్రాణ నష్టం అధికంగా వాటిల్లుతోందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. హైడ్రాక్సీక్లోరోక్వీన్ అమెరికన్ సీనియర్ సైనిక సిబ్బందిపై ఎలాంటి ప్రభావం చూపిందని ప్రభుత్వ నిధులతో సాగిన ఈ అథ్యయన వివరాలను మెడికల్ ప్రీప్రింట్ సైట్‌లో పొందుపరిచారు. ఈ అథ్యయనానికి పలు పరిమితులున్నా కరోనాను ఎదుర్కొనేందుకు హైడ్రాక్లీక్లోరోక్వీన్ పరమౌషధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా నమ్ముతున్న క్రమంలో ఈ మందు ఫలితాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా ఆగస్ట్ 11 వరకూ కరోనా బారినపడి మరణించిన వారు, డిశ్చార్జి అయిన 368 మంది సీనియర్ సిటిజన్ల వైద్య రికార్డులను పరిశీలించి పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు.
హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ను తీసుకున్న రోగుల్లో మరణాల రేటు 28 శాతం ఉండగా, యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్‌తో కలిపి ఈ మందును తీసుకున్న వారిలో మరణాల రేటు 22 శాతంగా నమోదైంది. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనా వైరస్‌పై సమర్ధంగా పోరాడుతుందని ఫ్రెంచ్ శాస్త్రవేత్త దీదీర్ రౌల్ట్ వెల్లడించడంతో ఈ డ్రగ్‌పై ఆసక్తి పెరిగింది. ఇక ప్రామాణిక వైద్యం పొందిన రోగుల్లో మరణాల రేటు 11 శాతమే ఉండటం గమనార్హం. ఈ అథ్యయనాన్ని ర్యాండమ్‌గా చేపట్టకుండా, ఇప్పటికే ముగిసిన కేసుల రికార్డులను పరిశీలించడం ద్వారా నిర్వహించడం ఈ సర్వేకున్న పరిమితుల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పరిశోధకులు పరిశీలించిన రోగుల్లో అత్యధికులు 65 సంవత్సరాలు దాటిన పురుషులు కాగా వారు అప్పటికే మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు కావడంతో ఈ ఫలితాలను సార్వజనీనంగా పరిగణించలేం.
చదవండి : కరోనా: ఇకపై 28 రోజుల హోం క్వారంటైన్!
కాగా హృదయ స్పందనల్లో ఇబ్బందులు ఉన్నవారికి, గుండె జబ్బులతో బాధపడేవారికి హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఇవ్వడం రిస్క్ అని అంతకుముందు పలు అథ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ను మలేరియా చికిత్సతో పాటు ఆటోఇమ్యూన్ డిజార్డర్లకు, ఆర్ధరైటిస్ చికిత్సకు దశాబ్ధాలుగా వాడుతున్నారు. కరోనా మహమ్మారికి చికిత్సలో ఈ మందు వాడకంపై పెద్దసంఖ్యలో రోగులకు, ర్యాండమ్ పద్ధతిలో క్లినికల్ ట్రయల్స్‌ను వైద్యుల పర్యవేక్షణలో సాగిస్తేనే కచ్చితమైన ఫలితాలు లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా, యూరప్, కెనడా, బ్రిటన్ సహా పలు దేశాల్లో ఈ తరహా అథ్యయాలు సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment