ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో హిందు మహిళలకు రక్షణ కరువైంది. పెళ్లి పందిట్లో నుంచి ఓ హిందూ వధువును అపహరించుకుని వెళ్లి, మత మార్పిడి చేసి, ముస్లిం యువకుడు పెళ్లి చేసుకున్న సంఘటన సంచలనం రేపుతోంది. పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి వివాహ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. మాటియారి జిల్లాలోని హాలా పట్టణంలో 24 ఏళ్ల హిందు యువతి భారతి బాయ్‌ను ముస్లిం యువకుడు, కొందరు రౌడీలతో కలిసి పోలీసుల సహకారంతో పెళ్లి మండపం నుంచి ఎత్తికెళ్లాడు. అనంతరం ఆమెకు బలవంతంగా ఇస్లాం మతాన్ని స్వీకరింపచేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటనపై భారతి తండ్రి కిషోర్ దాస్ మాట్లాడుతూ..తమ కుమార్తెకి మతియారా జిల్లా చెందిన వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించామని..కానీ అంతలోనే తమ కూతురిని షారుఖ్ గుల్ అనే ముస్లిం యువకుడు పోలీసుల సహకారంతో కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
భారతిని బుష్రాగా పేరు మార్చిన సర్టిఫికేట్‌ను ముఫ్తీ అబూబకర్ సయీద్ఉర్ రెహమాన్ అందజేసినట్లు తెలిసింది. కాగా జాతీయ గుర్తింపు కార్డులో భారతి హాలా నగరానికి చెందిన వ్యక్తిగా పేర్కొంటుండగా..కానీ తాత్కాలిక చిరునామాలో మాత్రం కరాచీ నగరం గుల్షాన్ ఇక్బాల్‌లో ఉంటున్నట్లు ఉంది. తమ కుమార్తెని నెల ముందే షారుక్ గుల్ మత మార్పిడి చేశాడని భారతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ షారుక్ గుల్ మాత్రం తనకు బుష్రాతో వివాహం అయిందని..హిందు వ్యక్తితో తన భార్య భారతికి ఆమె తల్లి దండ్రులు వివాహం జరిపిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సింధు ప్రావిన్స్‌లోని హలాలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా హిందు మైనారిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో మైనారిటీలైన హిందువులకు రక్షణ కల్పిస్తానన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment