ఉండటానికి ఇళ్లు లేదు.. చేయటానికి పని లేదు. కానీ, అతని ప్రతిభే.. అతనికి ఓ దారి చూపింది. ఉద్యోగం కోసం రోడ్డెక్కిన అతను చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే.. బడా కంపెనీలు సైతం స్పందించి అతనికి జాబ్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కాలిఫోర్నియాలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే...
సిలికాన్ వ్యాలీ: డేవిడ్ కసరెజ్(26) టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీ నుంచి మెనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. ఆస్టిన్(టెక్సాస్)లో ఓ మోటర్ కంపెనీలో వెబ్ డెవలపర్‌గా పని చేశాడు కూడా. అయితే కొత్త లైఫ్ కోసం కాలిఫోర్నియాకు వచ్చే క్రమంలో అతను తాను నివసించే వ్యాన్‌ను(సంచార జీవనం) పోగొట్టుకున్నాడు. దీంతో ఓ పార్క్ ఫుట్‌పాత్‌పై నివసిస్తూ ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్నాడు. అయితే కొత్త ప్రాంతం కావటం.. పైగా డబ్బు తక్కువగానే ఉండటంతో మరో ఆలోచన చేశాడు. రెజ్యూమ్‌ను వందల సంఖ్యలో కాపీలు తీయించి టిప్ టాప్‌గా రెడీ అయి శుక్రవారం ‘మౌంటెన్ వ్యూవ్’లోని ఓ సిగ్నల్ వద్ద నిల్చున్నాడు. ‘ఇళ్లు లేదు. విజయం కోసం పరితపిస్తున్నా. దయచేసి నా రెజ్యూమ్ తీసుకోండి’ అంటూ ఓ ఫ్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు. సిగ్నల్ వద్ద వాహనాల్లో ఉన్నవారికి రెజ్యూమ్ పంచుతూ పోయాడు. (రియాల్టీ షోలో ఊహించని ఘటన)
మరోవైపు సోషల్ మీడియాలో కూడా అతగాడి గురించి స్టోరీలు తెగ వైరల్ అయ్యింది. ఏదైతేనేం మొత్తానికి ఆ ఐడియా వర్కవుట్ అయ్యింది. మంచి ప్రొఫైల్ కావటంతో గూగుల్, నెఫ్లిక్స్, లింక్‌డిన్, సహా దాదాపు 200 కంపెనీలు అతనికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బి అవుతున్న కసరెజ్.. ఆలోచించుకుని మంచి కంపెనీలో జాయిన్ అవుతానని చెబుతున్నాడు. ‘డబ్బు సాయం చేస్తామని చాలా మంది ముందుకొచ్చారు. కానీ, నాకు కావాల్సింది ఉద్యోగమే. నేను తలెత్తుకుని జీవించాలనుకుంటున్నా. ఈ ప్రయత్నం విఫలమైతే తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోదామనకున్నా. కానీ, సక్సెస్ అయ్యా’ అని కసరెజ్ అంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment