పాకిస్తాన్ ప్రభుత్వం కుప్పకూలుతుందా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం సంకటంలో పడింది. షరీఫ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను మైక్రోసాఫ్ట్ ఫాంట్ చిక్కుల్లో పడేసింది. ఆ సంస్థకు చెందిన కాలిబ్రి ఫాంట్ షరీఫ్‌కు తలనొప్పిగా మారింది. ఇంకా చెప్పాలంటే ఈ ఫాంట్ కారణంగా ప్రధానమంత్రి షరీఫ్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఫాంట్ తప్పిదం ఏమీ లేకున్నా.. పనామా పేపర్స్ కుంభకోణంలో చేసిన తప్పును కప్పి పుచ్చుకునే క్రమంలో ఆ ఫాంటే వారిని చిక్కుల్లో పడేసింది.
అసలేం జరిగింది..
1990లలోనే పాక్‌కు ప్రధానిగా ఎన్నికైన నవాజ్ షరీఫ్, అతడి కుటుంబ సభ్యులు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పాకిస్థాన్ పోలీసులు, మిలటరీ, ఆర్థిక నియంత్రణ సంస్థలు కలిసి జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం(జేఐటీ)గా ఏర్పడి ఆయన కుటుంబ సభ్యులకు విదేశాల్లో ఉన్న ఆస్తుల విషయమై విచారణ చేపట్టాయి.
జేఐటీ ఇటీవలే తన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. విదేశాల్లో ఉన్న అవెన్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్‌కు షరీఫ్ కూతురే యజమాని అని, గతంలో ఆమె ఎప్పుడూ ఈ విషయాన్ని బయటపెట్టలేదని జేఐటీ కోర్టుకు తెలిపింది. అయితే, తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని విదేశాల్లోనూ ఆస్తులేమీ కూడబెట్టలేదని షరీఫ్ వాదిస్తున్నారు. ఈ క్రమంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
2006లోనే తన ఆస్తులకు సంబంధించిన డిక్లరేషన్ సమర్పించినట్టుగా షరీఫ్ కూతురు మర్యమ్ నవాజ్.. ఫోర్జరీ డాక్యుమెంట్లను రూపొందించినట్లు జేఐటీ అనుమానించింది. ఫోర్జరీ చేసిన డ్యాకుమెంట్లలో కాలిబ్రి ఫాంట్‌ను వాడారు. 2007 జనవరి 31 తర్వాతి నుంచే ఈ ఫాంట్ సాధారణ ప్రజానికానికి అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి కాలిబ్రి ఫాంట్‌ను మైక్రోసాఫ్ట్ 2004లో రూపొందించింది. మూడేళ్ల తర్వాత అంటే 2007లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఒక ఫాంట్‌గా చేర్చింది. దీంతో మర్యమ్ ఇబ్బందుల్లో పడ్డారు. డాక్యుమెంట్ ఫోర్జరీకి గురైంది విచారణలో తేలడంతో షరీఫ్ ప్రభుత్వానికి తిప్పలు తప్పేలా లేవు.