ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్-19) గురించే చర్చ నడుస్తోంది. ఈ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం మొదలు అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. మరోవైపు ఈ అంటువ్యాధిని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అయితే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడు తరచుగా వినిపిస్తున్న మాట స్వీయ నిర్బంధం. కానీ అన్ని వేళలా ఇది సాధ్యం కాకపోవచ్చు. లాక్‌డౌన్ అమల్లో ఉన్నా నిత్యావసరాలు తీసుకువచ్చేందుకు కొందరు బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ఏయే వస్తువులపై ఎంత సేపు బతికి ఉంటుంది... దాని బారిన పడకుండా తప్పించుకునే మార్గాల గురించి ది యూనివర్సిటీ ఆఫ్ క్వీన్‌ల్యాండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇయాన్ ఎమ్. మాకే తన ఆర్టికల్‌లో వివరించారు. (కరోనా వైరస్: ఎందుకంత ప్రమాదకారి?)
కరోనా ఎక్కడ ? ఎంతసేపు ?
- కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరల్లో ఉండే వైరస్ కణాలు గాలిలో మూడు గంటల పాటు బతికి ఉంటాయి.
- ప్లాస్టిక్, స్టీల్, బెంచ్ ఉపరితలం, గాజు, స్టీలు వస్తువులపై ఎక్కువగా 72 గంటల పాటు వైరస్ జీవించి ఉంటుంది.
- కార్డు బోర్డు, కాగితం, ఫ్యాబ్రిక్స్‌పై 24 గంటల పాటు చురుగ్గా ఉంటుంది.
- సమయం గడిచే కొద్దీ వైరస్ ప్రభావం తగ్గిపోతుంది. కానీ ఈ లోపు మనం సదరు వస్తువులను తాకినట్లయితే మనలోకి వైరస్ ప్రవేశించే అవకాశం ఉంది.
కరోనా సోకకుండా ఏ జాగ్రత్తలు పాటించాలి?
- మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మన చేతులను నిజమైన శత్రువులుగా భావించాలి.
- తరచుగా శానిటైజర్ లేదా సబ్బు లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రం చేసుకుంటుండాలి.
- ముఖ్యంగా చేతులతో ముఖాన్ని తాకే అలవాటును పూర్తిగా మానుకోవాలి
- కళ్లు, ముక్కు, పెదాలు, నోటిపై చేతులు ఆనించకుండా జాగ్రత్త పడాలి.
- వ్యక్తిగత శుభ్రత పాటించాలి
- మనిషికి మనిషికీ కనీం ఒక మీటరుకుపైగా ఎడం పాటించాలి
- ఇంటిని ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బ్లీచ్, డిటర్జెంట్లు, ఆల్కహాల్ కలిగి ఉన్న ద్రావణాలతో గచ్చు కడగాలి. బూట్లు ఇంటి బయటే విప్పాలి.
- రోజూ ఉదయం కొద్దిసేపు సూర్య కిరణాలు పడేలా నీరెండలో కూర్చోవాలి.
- ముఖ్యంగా సామాజిక, భౌతిక దూరం పాటించాలి.
- రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి.
ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే..
- నిత్యావసర వస్తువుల కోసం షాపింగ్‌కు వెళ్లినపుడు ఉపయోగించే ట్రాలీలు, బాస్కెట్లపై వైరస్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శానిటైజర్, యాంటీ బాక్టీరియల్ వైప్స్ వెంట ఉంచుకోవాలి. వీలైతే చేతులకు గ్లౌవ్స్ వేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని బయటపడేయాలి.
- నిల్వ ఉంచిన ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ప్రాసెసింగ్ చేస్తారు. ఆ సమయంలో వైరస్ సోకిన వ్యక్తి పరిసర ప్రాంతాల్లో దగ్గిన, తుమ్మితే వైరస్ అందులో ఉండిపోయే ప్రమాదం ఉంటుంది.
- ఇక కూరగాయలు, పండ్లు కొన్నపుడు వాటిని నానబెట్టి ఒకటికి రెండుసార్లు కడగాలి.
- స్టోర్లు, ఆఫీసులకు వెళ్లినపుడు లిఫ్టు బటన్లు మోచేతితో నొక్కాలి. హ్యాండిల్స్ పట్టుకోవడం మానుకోవాలి. పబ్లిక్ బాత్‌రూంలు ఉపయోగించినపుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.
*** ఇక అన్నింటి కంటే ముఖ్యమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి అలవాట్లకు మించిన ఆయుధం లేదు. ఆరోగ్యానికి మించిన సంపద లేదన్న విషయాన్ని గ్రహించి బాధ్యతగా మెలుగుతూ, మానవాళి మనుగడ సాగించడంలో మన వంతు పాత్ర పోషించాలి.
Comments
Please login to add a commentAdd a comment