ఫరో ఐలాండ్స్ : వందల సంఖ్యలో డాల్ఫిన్లు, వేల్స్‌లను వధిస్తున్న ఫొటోలు డెన్మార్క్‌లో కలకలం రేపాయి. పర్యాటకుల్లా వధ జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించిన 'సీ షెపర్డ్' అనే ఓషన్ కన్జర్వేషన్ గ్రూప్ సభ్యులు ఈ ఫొటోలను వెలుగులోకి తీసుకొచ్చారు. డెన్మార్క్‌లోని ఫరో ఐలాండ్‌లోని తొమ్మిది ప్రదేశాల్లో ఈ వధలు జరుగుతున్నట్లు కన్జర్వేషన్ గ్రూప్ పేర్కొంది.
గ్రూప్ సభ్యులు తీసిన చిత్రాల్లో డాల్ఫిన్లు, వేల్స్‌ల రక్తంతో సముద్ర నీరు ఎర్రగా మారింది. "స్పెనల్ లాన్స్"తో వాటి వెన్నుపూసలను క్రూరంగా తెగ నరుకుతున్నట్లు సీ షెపర్డ్ సభ్యులు తెలిపారు. మొత్తం 198 డాల్ఫిన్లు, 436 పైలట్ వేల్స్ వధకు గురైనట్లు వెల్లడించారు. గత వేసవిలో ఈ వధలు జరిగినట్లు పేర్కొన్నారు.
సీ షెపర్డ్ ఫొటోలపై స్పందించిన ఫరో ఐలాండ్ ప్రభుత్వం ఈ ఏడాది 1,700 పైలట్ వేల్స్‌ను వధించినట్లు పేర్కొంది. అయితే, వేల్స్‌ను చంపడాన్ని 'శాడిస్టిక్ సైకోపాత్' అని సీ షెపర్డ్ పేర్కొనడంపై మండిపడింది. ఐలాండ్ పరువు తీసేందుకు సీ షెపర్డ్ యత్నిస్తోందని ఆరోపించింది.
పైలట్ వేల్స్‌ను వేటాడి ఆహారంగా తీసుకోవడం ఐలాండ్‌లో ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోందని చెప్పింది. వేల్స్‌ను వేటాడటం ఆపేస్తే విదేశాల నుంచి పౌరులకు అవసరమైన ఆహారం దిగుమతి చేసుకోవాల్సివస్తుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment