![Hurricane Florence evacuations on South Carolina coast - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/11/HARRICANE.jpg.webp?itok=ebT9yu6E)
నాసా విడుదల చేసిన తుపాను ఉపగ్రహ చిత్రం
మియామి: అట్లాంటిక్ మహా సముద్రంలో ఏర్పడిన ‘ఫ్లోరెన్స్’ హరికేన్ అగ్రరాజ్యం అమెరికాను కలవరపెడుతోంది. ప్రస్తుతం అమెరికా తూర్పు తీరంవైపు కదులుతున్న ఈ కేటగిరి–1 హరికేన్ క్రమంగా శక్తి పుంజుకుంటోందని జాతీయ హరికేన్ కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి నాటికి ఇది కేటగిరి–4 హరికేన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని వెల్లడించింది. దీని కారణంగా అమెరికా తూర్పుతీరంలో ఉన్న రాష్ట్రాల్లో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ప్రభావంతో కొండ చరియలు విరిగిపడతాయని హెచ్చరించింది.
ప్రస్తుతం బెర్ముడాకు 1,100 కి.మీ ఆగ్నేయంగా ఈ హరికేన్ కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. అమెరికా తూర్పు తీరంలో ఫ్లోరెన్స్ విధ్వంసం 2–3 రోజుల పాటు కొనసాగవచ్చని ఎన్‌హెచ్‌సీ తెలిపింది. ఉత్తర కరోలీనా, వర్జీనియా, దక్షిణ కరోలీనా రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించే అవకాశముందని వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కరోలీనా రాష్ట్రాల మధ్య హరికేన్ గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశముందంది. ప్రస్తుతం అట్లాంటిక్ సముద్రంలో కొత్తగా ఐజాక్, హెలెన్ హరికేన్లు ఏర్పడినప్పటికీ, ఇవి అమెరికా తీరంవైపు రావడానికి వారం రోజులు పడుతుందని తెలిపింది. ఫ్లోరెన్స్ హరికేన్‌ను ఎదుర్కొనేందుకు దక్షిణ కరోలినా, వర్జీనియా, ఉత్తర కరోలినా రాష్ట్రాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment