హైదరాబాదీకి సౌదీలో 300 కొరడా దెబ్బల శిక్ష! | hyderabadi mba graduate convicted in saudi, gets 300 lashes | Sakshi
Sakshi News home page

హైదరాబాదీకి సౌదీలో 300 కొరడా దెబ్బల శిక్ష!

Published Thu, Jan 5 2017 4:42 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాదీకి సౌదీలో 300 కొరడా దెబ్బల శిక్ష! - Sakshi

హైదరాబాదీకి సౌదీలో 300 కొరడా దెబ్బల శిక్ష!

దోపిడీ కేసులో నేరం రుజువైన ఓ హైదరాబాదీ ఎంబీయే పట్టభద్రుడికి సౌదీ అరేబియాలో ఏడాది జైలుశిక్షతో పాటు 300 కొరడా దెబ్బలు కూడా విధించారు. అయితే.. తమ కొడుకు నిర్దోషి అని, ప్రస్తుతం అతడిని సౌదీ అరేబియాలోని వదీ అల్ దవాసిర్ జైల్లో పెట్టారని హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన అతడి తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ కుమారుడిని కాపాడుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సాయం కోరారు. 
 
మలక్‌పేటకు చెందిన మహ్మద్ మన్సూర్ హుస్సేన్.. 2013 నుంచి రియాధ్‌లో పనిచేస్తున్నారు. ఎంబీయే పట్టభద్రుడైన హుస్సేన్.. మార్కెటింగ్ ఆడిటర్ ఉద్యోగంలో ఉన్నారు. గత సంవత్సరం ఆగస్టు 25న అతడు 1.06 లక్షల సౌదీ రియాళ్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు తుపాకి చూపి బెదిరించి అతడిని దోచుకున్నారని హుస్సేన్ తల్లిదండ్రులు చెప్పారు. నంబరు ప్లేటు లేని కారులో వాళ్లు పారిపోయారన్నారు. ఈ విషయాన్ని తన యజమానికి చెప్పగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయమని తెలిపారు. తీరా స్టేషన్‌కు వెళ్తే హుస్సేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన తల్లి హూరున్నీసా చెప్పారు. 
 
ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఆమె తెలిపారు. తన కొడుకును విడిపించడానికి సాయం చేయాలని కోరారు. ఇంతకుముందు అతడు 15 లక్షల సౌదీ రియాళ్లు కూడా డిపాజిట్ చేశాడని, ఇంత చిన్న మొత్తానికి కక్కుర్తి పపడే రకం కాదని ఆమె చెప్పారు. కంపెనీ యజమానులు కూడా దీని గురించి ఆలోచించాలని విలపిస్తూ చెప్పారు. అక్కడి పోలీసులు హుస్సేన్‌ను నమ్మడం లేదన్నారు. ఈ విషయం తెలిసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా సుష్మాను ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. హుస్సేన్‌కు వీలైనంత సాయం చేస్తామని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం హామీ ఇచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement