రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధం
సీఎంతో భేటీలో సౌదీ రాయబారి అల్సతి
► తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని వెల్లడి
► సౌదీ, హైదరాబాద్ మధ్య సాంస్కృతిక వారసత్వం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగం పంచుకుంటామని, పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశం సిద్ధమని సౌదీ అరేబియా రాయబారి డాక్టర్ సాద్ మహమ్మద్ అల్సతి వెల్లడించారు. సౌదీ ప్రభుత్వ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక వ్యవహారాల ప్రతినిధుల బృందంతో కలసి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అల్సతి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నామన్నారు. రాష్ట్రం విద్య, వైద్య రంగాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో పురోగమిస్తుండటం, మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుండటంపట్ల ఆనందం వ్యక్తం చేశారు.
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలతో ఇక్కడ జరిగిన భేటీ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను తెలుసుకున్నామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దిశగా కసరత్తు చేయాలని తమ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక, వ్యాపార మంత్రిత్వ శాఖలను ఆదేశించిందన్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం సౌదీ సంస్కృతితో ముడిపడి ఉందన్నారు. తెలంగాణ నుంచి వెళ్లే హజ్ యాత్రికుల సౌకర్యార్థం ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ సౌదీలోని కాబాకు సమీపంలో రుబాత్ (వసతి గృహం) నిర్మించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన హజ్ యాత్రికులను సౌదీ ప్రజలు ‘అల్లా అతిథులు’గా గౌరవిస్తారని, ప్రపంచంలో మరెవరికీ దక్కని గౌరవం తెలంగాణ ప్రజలకు లభించిందని భావిస్తున్నామన్నారు. నిజాం కాలం నుంచే సౌదీతో తెలంగాణ ప్రజలకు సత్సంబంధాలున్నాయన్నారు.
సౌదీ అరేబియా-తెలంగాణ మధ్య పాత స్నేహాన్ని పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాపార రంగంలో పెట్టుబడులతో స్నేహబంధం బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకున్న సౌదీ రాయబారి... తమ దేశ ప్రభుత్వం సైతం మతాలకు అతీతంగా భారత విద్యార్థులకు 460 స్కాలర్‌షిప్‌లను అందిస్తోందన్నారు.
హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు చేయండి
హైదరాబాద్ కేంద్రంగా సౌదీ అరేబియా కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సౌదీ రాయబారికి సీఎం సూచించారు. 3 లక్షల మందికిపైగా తెలంగాణవాసులు సౌదీలో నివసిస్తున్నారని, గత హైదరాబాద్ సంస్థాన పరిధిలోని ఇతర ప్రాంతాల వారూ పెద్ద సంఖ్యలో సౌదీలోనే ఉన్నారన్నారు. హైదరాబాద్ కేంద్రంగా వారంతా రాకపోకలు సాగిస్తున్నందున హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై స్పందించిన అల్సతి...ఇందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సౌదీలో తెలంగాణవాసులు ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను తక్షణమే స్వరాష్ట్రానికి తరలించేందుకు సహకరించాలని సీఎం కోరారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కె.కేశవరావు, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఎమ్మెల్సీ సలీం, మైనారిటీల శాఖ కార్యదర్శి ఉమర్‌జలీల్, సౌదీ అధికారులు పాల్గొన్నారు.