వీడియోలో వేడుకుంటున్న యువకులు
జగిత్యాల క్రైం: ‘నమస్తే కేసీఆర్ సారూ.. కేటీఆర్ సారూ..! మేము సౌదీలో చిత్రహింసలకు గురవుతున్నాం. మా కంపెనీ యజమాని రోజూ రాత్రి వచ్చి కొడుతుండు. చంపుతానని బెదిరిస్తుండు. ఈ చిత్రహింసలు భరించలేకపోతున్నం. ఈరోజు రాత్రే ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోవాలనుకుంటున్నం. మీరే మాయందు దయతలచి ఇండియాకు వచ్చేలా చూడుండ్రి సారూ..’అంటూ జగిత్యాల జిల్లాకు చెందిన ఏడుగురు యువకులు సోషల్ మీడియాలో ఆదివారం ఓ వీడియోను పోస్టు చేశారు.
ఈ వీడియో వైరల్ అవడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. రెండేళ్ల క్రితం వీరు సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లారు. అంబారీపేటకు చెందిన గోనెల వెంకట్‌రెడ్డి, ఆదె మహేశ్, ఆనగండ నడిపి అంజన్న, అంతర్గాంకు చెందిన భూపెల్లి రంజిత్, లక్ష్మీపూర్‌కు చెందిన నక్క వేణు, జిల్లాకు చెందిన మరో ఇద్దరు యువకులు అక్కడ చిక్కుకున్నారు. కంపెనీ యజమాని చేతిలో చిత్రహింసలు పడుతున్నామని రోదిస్తూ తెలిపారు.
తమను ఎలాగైనా ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను కోరారు. కొద్దికాలంగా కంపెనీ యజమాని మధ్యాహ్నం వేళ పనిచేయించుకొని, రాత్రి వచ్చి కొడుతున్నాడని తెలిపారు. పోలీసులను తీసుకొచ్చి బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడని, అనారోగ్యానికి గురైనా ఆస్పత్రులకు వెళ్లనీయడం లేదని పేర్కొన్నారు. ఇక చిత్రహింసలు భరించలేకపోతున్నామని.. కంపెనీ నుంచి బయటకు పారిపోతున్నామని తెలిపారు. తమను సొంతూర్లకు చేర్చేలా చూడాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment