సాక్షి, తుర్కయాంజాల్: ‘తెలంగాణ ప్రజలు నూకలు తినండి అన్న బీజేపీ నాయకుల తోకలు కట్ చేద్దామా వద్దా..? ఆ పార్టీకి నూకలు చెల్లేలా తీర్పులు ఇద్దామా వద్దా..? ప్రజలు ఆలోచించాలి’అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లోని బీఎంఆర్ సార్థ కన్వెన్షన్ హాల్‌లో శనివారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో టెస్కాబ్ అధ్యక్షుడు కోడూరి రవీందర్‌రావు అధ్యక్షతన జరిగిన రైతు అవగాహన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల చైతన్యాన్ని ప్రధాని మోదీ తక్కువగా అంచనా వేస్తున్నారని అన్నారు. వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్ కరెంటు మీటర్లు పెట్టాలని చూస్తున్నారని, అయితే తన గొంతులో ప్రాణం ఉండగా అది సాధ్యం కాదని ఇంతకు ముందే సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చినంత మాత్రాన నల్లగొండ జిల్లా ప్రజల సంపద పెరగదన్నారు.
నల్లగొండకు రూ.18 వేల కోట్ల నిధులు ఇస్తే మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయమని సవాల్ విసిరినా స్పందించినవారే లేరన్నారు. ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడా రైతు కంట కన్నీరు తుడిచే నాయకత్వమే లేదని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల అమలుతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేపల పిల్లల పంపిణీతో నీలి విప్లవం వచ్చిందన్నారు.
అత్యధిక రైతుబంధు సాయం మునుగోడుకే..
దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆహార సూచిలో మన దేశం వెనుకబడి పోవడం దారుణమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అభాగ్యులకు అండగా ఉండాలని రాష్ట్రంలోని 50 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నామని, 30 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో అత్యధికంగా 2.65 లక్షల ఎకరాల భూమికి రైతుబంధు సాయం అందుతున్న నియోజకవర్గం మునుగోడు అని, లక్ష 46 వేల మందికి 9 విడతల్లో రూ.1,031 కోట్ల సాయం అందిందని వివరించారు.
రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్
రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం అయితే పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి తెలంగాణనే నిదర్శనం అని మంత్రి సబితారెడ్డి అన్నారు. 7 గంటల కరెంటు కోసం ఎదురుచూసే రోజుల నుంచి 24 గంటల కరెంటు అందివ్వడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ వేల కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టెస్కాబ్ ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్ రెడ్డి, పలు జిల్లాల డీసీసీబీ చైర్మన్లు, మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment