'భారత్.. హాట్ పిస్టల్ లాంటిది'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి ముందంజలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి భిన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా, వియత్నాం, జపాన్ లతో పాటు మెక్సికో పై కూడా తనకు ఎలాంటి కోపం లేదంటూ తన వైఖరి మార్చుకున్నాడు. భారత్ పై కూడా తనకు కోపం లేదంటూనే తమ దేశ ఉద్యోగాలతో పాటు ఎన్నో విషయాల్లో అన్యాయం చేస్తుందంటూ ఆరోపించారు. 'చైనా తన అనుచిత వాణిజ్య విధానాలతో అమెరికాను అత్యాచారం చేస్తోంది. తాను అధికారంలోకి వస్తే చైనా అత్యాచారాలను కొనసాగనివ్వను' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. తనకు ఏ దేశంపైనా విముఖత లేదంటూ కొత్తతరహా ప్రచారానికి తెరతీశాడు.
పేలడానికి సిద్ధంగా ఉన్న హాట్ పిస్టల్ లాగ భారత్ ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారత్ ను ఓ సందర్భంలో విమర్శించడం, మరోసారి తనకు ఆ దేశంపై కోపంగా ఉండటం లేదని అక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇండియానాలో ప్రచారంలో భాగంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పించారు. ఒబామా ఆర్థిక, వ్యాపార విధానాల వల్ల తాను ప్రస్తావించిన దేశాలు తమ ఉద్యోగాలను కొల్లగట్టాయని పేర్కొన్నారు. 1990లో తలెత్తిన ఆర్థికమాంధ్యం కారణంగా మూడింట ఒక వంతు మంది ఉద్యోగాలు కోల్పోయారని తన ప్రసంగంలో వివరించారు. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చి మా ఉద్యోగాలు కొల్లగొట్టడమే వాళ్ల పని అంటూ భారత్, చైనా, జపాన్ దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు.