మాలీ : తీవ్ర రాజకీయ సంక్షోభం నడుమ జరిగిన మాల్దీవులు అధ్యక్ష ఎన్నికల్లో విపక్షనేత ఇబ్రహీం మహ్మద్ నల్హీ అఖండ విజయం సాధించారు. మాల్దీవులు ప్రజల్లో నియంతగా ముద్రపడ్డ ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ యామీన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసి, ఆయన పాలనకు చరమగీతం పాడారు. ఇప్పటి వరకు ముగిసిన 92 శాతం ఓటింగ్ లెక్కింపులో ఇబ్రహీం మహ్మద్‌కు అత్యధికంగా 53 శాతం ఓట్లు వచ్చినట్లు సోమవారం మాల్దీవులు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆయన విజయం దాదాపు ఖరారైంది. మిగిలిన ఫలితాలు అనంతరం ఈసీ ఆయన విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మాల్దీవులు డెమోక్రటిక్ పార్టీకి చెందిన మహ్మద్ ఆ దేశ విపక్షనేతగా గుర్తింపు పొందారు. విజయం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రజలు అందించిన ప్రజాస్వామ్య విజయం అని అన్నారు.
తన గెలుపుకు కృషిచేసిన మాల్దీవులు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా గత రెండేళ్ల నుంచి మాల్దీవులు తీవ్ర అంతర్గత సంక్షోభం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రాజకీయ సంక్షోభం కారణంగా అబ్దుల్ యామీన్ గత ఫిబ్రవరిలో 45 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధించారు. ఇబ్రహీం విజయంపై భారత విదేశాంగశాఖ అయనకు అభినందనలు తెలిపింది. మాల్దీవులు గతకొంత కాలంగా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. హిందూమహా సముద్ర ప్రాంతంలో చైనా, మాల్దీవుల మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో.. భారత్ మాల్దీవులును దగ్గర చేసుకునేందుకు ఆర్థిక పరంగా సహకారం అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment