
ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ 22వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ఇమ్రాన్ ఖాన్(65)కు మార్గం సుగమమైంది. ఇస్లామాబాద్‌లోని పాక్ జాతీయ అసెంబ్లీలో శుక్రవారం ప్రధాని పదవికి జరిగిన ఎన్నికలో ఇమ్రాన్‌కు 176 ఓట్లు రాగా, ప్రతిపక్ష పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) చీఫ్ షాబాజ్ షరీఫ్‌కు కేవలం 96 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ నేపథ్యంలో శనివారం అధ్యక్ష భవనంలో ఇమ్రాన్ చేత పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఓటింగ్ సందర్భంగా బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో 54 మంది సభ్యులున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఓటు వేయకపోవడంతో ప్రధానిగా ఇమ్రాన్ ఎన్నిక లాంఛనప్రాయమైంది.
ఎన్నిక సందర్భంగా తమకు ఓటేయాలని పీఎంఎల్–ఎన్ నేత షాబాజ్ వ్యక్తిగతంగా చేసిన విజ్ఞప్తిని సైతం బిలావల్ భుట్టో తిరస్కరించారు. ముత్తహిద క్వామీ మూమెంట్(7), బలూచిస్తాన్ అవామీ పార్టీ(5), పాకిస్తాన్ ముస్లిం లీగ్(3), గ్రాండ్ డెమొక్రటిక్ అలయెన్స్(3), అవామీ ముస్లిం లీగ్(1), జమోరి వతన్ పార్టీ(1)లు ఇమ్రాన్‌కు మద్దతు ఇచ్చాయి. అంతేకాకుండా 9 మంది స్వతంత్ర అభ్యర్థులు ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) పార్టీలో చేరడం, మహిళలకు రిజర్వు చేసిన 60 సీట్లలో 28 స్థానాలను, మైనారిటీలకు కేటాయించిన 10 సీట్లలో ఐదింటిని పీటీఐ దక్కించుకుంది. దీంతో ఇమ్రాన్ మద్దతుదారుల బలం జాతీయ అసెంబ్లీలో ఏకంగా 176 సీట్లకు చేరుకుంది.
పాక్ ప్రధాని అయ్యేందుకు 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో 172 మంది మద్దతు కావాలి. ఈ ఎన్నికలో ఇమ్రాన్ గెలిచినట్లు పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ కైసర్ ప్రకటించగానే, ప్రతిపక్ష పీఎంఎల్–ఎన్ సభ్యులు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో నినాదాలు చేశారు. మరోవైపు నలుపు రంగు షేర్వానీలో ఇమ్రాన్ శనివారం ప్రమాణస్వీకారం చేస్తారని పీటీఐ అధికార ప్రతినిధి ఫైజల్ జావేద్ తెలిపారు.
లాహోర్‌కు చేరుకున్న సిద్ధూ
మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు శుక్రవారం లాహోర్‌కు చేరుకున్నారు. నీలిరంగు సూట్, గులాబీ రంగు తలపాగా ధరించిన సిద్ధూ వాఘా సరిహద్దు మీదుగా పాక్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా లాహోర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ పాకిస్తాన్‌ల మధ్య శాంతిచర్చల ప్రక్రియ కోసం ఇమ్రాన్ ఖాన్ చొరవ తీసుకోవాలని కోరారు. తాను పాక్‌కు ఓ స్నేహితుడిగానే వచ్చాననీ, ప్రేమ సందేశాన్ని తీసుకొచ్చానని వెల్లడించారు. ఆటగాళ్లు, కళాకారులు ఇరుదేశాల ప్రజలను దగ్గరచేయడంలో సాయపడతారని వ్యాఖ్యానించారు.
తన స్నేహితుడు ఇమ్రాన్ సంతోషంలో భాగం పంచుకునేందుకే వచ్చానని సిద్ధూ అన్నారు. ఇమ్రాన్ కోసం బహుమతిగా ‘కశ్మీర్ శాలువ’ను తీసుకొచ్చినట్లు సిద్ధూ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. శనివారం ఇస్లామాబాద్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం సిద్ధూ ఇస్లామాబాద్‌కు వెళ్లనున్నారు. కాగా ఇమ్రాన్ ఆహ్వానం పంపినప్పటికీ మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లు వ్యక్తిగత కారణాలతో ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment