ఇస్లామాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ కట్టడికై విధించిన లాక్‌డౌన్‌ను త్వరలోనే ఎత్తివేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. లాక్‌డౌన్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టలేదని.. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడాలంటే ప్రజలంతా వైరస్‌తో కలిసి జీవించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ జాగ్రత్తగా ఉండకపోతే మీరే బాధపడాల్సి ఉంటుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక కరోనా సంక్షోభంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు నగదు బదిలీ చేశామని.. ఇకపై ఆ సహాయం ఎవరికీ అందించలేమని స్పష్టం చేశారు. కాగా పాకిస్లాన్‌లో ఇప్పటివరకు 72 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. దాదాపు 1543 మంది మహమ్మారి బారిన పడి మరణించారు.(కరోనా ఇప్పటికే ప్రాణాంతకమే : డబ్ల్యూహెచ్‌ఓ)
ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేసేందుకు సిద్ధపడ్డ ఇమ్రాన్ ఖాన్.. త్వరలోనే దేశ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. అయితే సినిమా థియేటర్లు, పాఠశాలలు మాత్రం మరికొన్ని రోజులు మూసి ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ కారణంగా ఆదాయం భారీగా పడిపోయింది. ఇకపై దాని ప్రభావాన్ని తట్టుకునే శక్తి పాకిస్తాన్‌కు లేదు. నిజమే లాక్‌డౌన్ పేదల పాలిట శాపంగా మారినందుకు బాధగానే ఉంది. కానీ వారిని పోషించేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదు. అయినా ఇంకెన్నాళ్లని వాళ్లకు డబ్బులు ఇవ్వాలి. (అడ్డంగా దొరికిపోయిన పాక్..)
ఇంకో విషయం.. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు అది వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. కాబట్టి దాంతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. అగ్రరాజ్యమైన అమెరికాలో దాదాపు లక్ష మంది వైరస్ బారిన పడి చనిపోయారు. అయినప్పటికీ లాక్‌డౌన్ పొడిగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందనే కారణంతో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. లేదంటే దాని ఫలితాలు మీరే అనుభవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు సహకరించండి’’అని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment