
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సన్నిహితుడు, అధికార తెహ్రిక్–ఇ–ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ ఆరిఫ్ అల్వీ(69) పాక్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష బరిలో అల్వీతోపాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి ఐత్‌జాజ్ అహ్సాన్, పాకిస్తాన్ ముస్లింలీగ్–ఎన్ బలపరిచిన మౌలానా ఫజుల్–ఉర్–రహ్మాన్ ఉన్నారు. మంగళవారం రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగిన పోలింగ్‌లో నేషనల్ అసెంబ్లీ, సెనేట్‌కు సంబంధించిన 430 ఓట్లలో అల్వీకి 212 ఓట్లు, రహ్మాన్ 131, అహ్సాన్‌కు 81 ఓట్లు రాగా ఆరు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.
తనను బలపరిచి, తనపై గురుతర బాధ్యతలు మోపిన ప్రధాని ఇమ్రాన్‌కు అల్వీ కృతజ్ఞతలు తెలిపారు. దేశమంతటికీ, అన్ని రాజకీయ పార్టీలకు తాను అధ్యక్షుడిననీ, అన్ని పార్టీలను సమభావంతో చూస్తానని అల్వీ పీటీఐతో అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడి పదవీకాలం ఈనెల 8వ తేదీతో ముగియనుండగా 9వ తేదీన నూతన అధ్యక్షుడిగా అల్వీ ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశాధినేతగా వ్యవహరించే పాక్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి సలహా మేరకు అధికారాలను చలాయిస్తారు. సన్నిహితుడికి అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ద్వారా ఇమ్రాన్ తన అజెండాను అమలు చేసే వీలుంది.