దేవయాని ఉదంతంపై అమెరికాను కోరిన భారత కొత్త రాయబారి జైశంకర్
వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై మోపిన అభియోగాలను తక్షణమే ఉపసంహరించాలని అమెరికాలో భారత కొత్త రాయబారి ఎస్ జైశంకర్ ఆ దేశానికి విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దేవయాని అరెస్టుపై తీవ్ర నిరసన తెలిపారు. తన నియామక పత్రాలను చీఫ్ ఆప్ ప్రొటోకాల్ ఆఫీసులో సమర్పించిన తర్వాత అమెరికా విదేశాంగశాఖ ఉపమంత్రులు వెండీ షెర్మన్(రాజకీయ వ్యవహారాలు), పాట్రిక్ ఎఫ్ కెన్నడీ(నిర్వహణ)లతో ఆయన భేటీ అయ్యారు. భేటీల్లో దేవయాని అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆమెపై అభియోగాలను తక్షణమే ఉపసంహరించాలని జయశంకర్ కోరినట్లు సమాచారం. భారత దౌత్యవేత్తల ఇళ్లలోని భారతీయ పనిమనుషుల కుటుంబ సభ్యులను అమెరికా ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
మరోవైపు ఐక్యరాజ్యసమితిలోని భారత దౌత్యబృందంలో ప్రతినిధిగా ఉన్న దేవయానికి దౌత్యపరంగా పూర్తి రక్షణ కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ తెలిపారు. ‘ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారత ప్రతినిధి బృంద సభ్యురాలిగా ఖోబ్రగడేను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నియమించినట్టు మాకు భారత ప్రభుత్వం తెలిపింది’ అని పేర్కొన్నారు. ఐరాసలోని భారత శాశ్వత బృందం సలహాదారుగా దేవయానికి 2013 ఆగస్టు 26న ఐరాస గుర్తింపునిచ్చింది. అది ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. దీంతో పూర్తి దౌత్య రక్షణ ఉన్న ఆమెను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై అమెరికాకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేయొచ్చని భారత అమెరికన్ లాయర్ రవి బాత్రా వివరించారు.
అమెరికా రాయబారి నేపాల్ పర్యటన రద్దు
న్యూఢిల్లీ: దేవయాని అరెస్టు పరిణామాల నేపథ్యంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ తన నేపాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దేవయానిపై అమెరికా తీరుకు నిరసనగా భారత్‌లోని అమెరికా దౌత్యవేత్తలకు కల్పిస్తున్న కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కేంద్రం తగ్గించడం తెలిసిందే. ఇందులో భాగంగా విమానాశ్రయాల్లో తనిఖీలు లేకుండా స్వేచ్ఛగా వెళ్లడానికి పావెల్‌కు ఇప్పటివరకు ఉన్న సౌకర్యాన్ని ఉపసంహరించారు. దీంతో ఆమె పర్యటనను రద్దు చేసుకున్నారు.