దిగొస్తున్న అమెరికా
ద్వైపాక్షిక చర్చల ఎజెండాలో
పనిమనుషుల అంశం ఉంటుందని ప్రకటన
‘దేవయాని వివాదం’పై పరిష్కారానికి
భారత్‌తో చర్చిస్తున్నట్లు వెల్లడి
వాషింగ్టన్/న్యూయార్క్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై అమెరికా వ్యవహరించిన తీరుకు ప్రతిచర్యగా ఆ దేశ కాన్సులేట్ సిబ్బందికి తీవ్ర నేరాల్లో కల్పిస్తున్న దౌత్యపరమైన న్యాయ రక్షణను భారత్ కుదించిన నేపథ్యంలో అగ్రరాజ్యం దిగొస్తోంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల ఎజెండాలో పనిమనుషుల నియామకం అంశం కూడా ఉంటుందని బుధవారం ప్రకటించింది. అలాగే దేవయాని అరెస్టుతో తలెత్తిన దౌత్య వివాదానికి పరిష్కారంపై ముందడుగు విషయంలో భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖకు చెందిన ఓ అధికారి పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. ‘న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ నుంచి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత దౌత్య కార్యాలయానికి దేవయాని బదిలీ దరఖాస్తును మేం సమీక్షిస్తూనే ఉన్నాం. అదే సమయంలో ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని మేం గుర్తించాం. రానున్న వారాలు, నెలల వ్యవధిలో జరగబోయే ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల్లో పనిమనుషుల నియామకం అంశం ఎజెండాలో ఉంటుంది’ అని ఆ అధికారి వ్యాఖ్యానించారు.
దర్యాప్తు అధికారిది పొరబాటు: దేవయాని లాయర్
దేవయానిపై వీసా మోసం అభియోగాల దర్యాప్తు, అరెస్టు విషయంలో అమెరికా దౌత్య భద్రతా సేవల ఏజెంట్ మార్క్ స్మిత్ పొరబాటు చేశారని ఆమె తరఫు న్యాయవాది డానియల్ అర్షాక్ పేర్కొన్నారు. దేవయాని ఇంటి పనిమనిషి సంగీతా రిచర్డ్ జీతానికి సంబంధించి సమర్పించిన పత్రాలను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. సంగీతా రిచర్డ్ వీసా దరఖాస్తుతోపాటు జత చేసిన డీఎస్-160 ఫారంలో పొందుపరిచిన దేవయాని మూలవేతనం 4,500 డాలర్లను సంగీతా రిచర్డ్ ఆశిస్తున్న జీతంగా ఆ అధికారి పొరబాటుపడ్డారని డానియల్ తెలిపారు. వాస్తవానికి సంగీతా రిచర్డ్‌కు నెలకు 1,560 డాలర్లను (గంటకు 9.75 డాలర్ల చొప్పున వారానికి 40 గంటల పనికి) చెల్లించేందుకు దేవయాని ఆమెతో ఒప్పందం కుదుర్చుకుందని న్యాయవాది గుర్తుచేశారు. ఫెడరల్ ఏజెంట్ పొరబాటుపడటం తీవ్రమైన విషయమన్నారు.