దేవయాని ఉదంతంలో అమెరికాపై ప్రతిచర్యలు
న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్టులో అమెరికా దాష్టీకంపై భారత ప్రభుత్వం మంగ ళవారం కఠిన చర్యలు తీసుకుంది. ప్రతిచర్యల్లో భాగంగా భారత్‌లోని అమెరికా కాన్సులేట్ సిబ్బందికి ఉన్న న్యాయరక్షణను కుదించింది. వారి కుటుంబ సభ్యులకు ఉన్న దౌత్యపరమైన న్యాయరక్షణను ఉపసంహరించింది.
దేశంలోని నాలుగు అమెరికా కాన్సులేట్ల అధికారులకు న్యాయరక్షణను పరిమితం చేస్తున్నట్లు తెలిపే కొత్త గుర్తింపు కార్డులను మంజూరు చేస్తోంది. ఇవి అచ్చం అమెరికా.. భారత కాన్సులేట్ సిబ్బందికి ఇస్తున్న కార్డులను పోలి ఉన్నాయి. వీటి కారణంగా తీవ్రనేరాల విషయంలో ఇక అమెరికా కాన్సులేట్ సిబ్బందికి న్యాయరక్షణ లభించదు. అమెరికాలోని మన దౌత్యవేత్తలకు పరిమిత న్యాయరక్షణే ఉండడ ంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అలాగే అమెరికాలోని భారత దౌత్యవేత్తల కుటుంబ సభ్యులకు దౌత్య గుర్తింపు కార్డులు లేని నేపథ్యంలో మన దేశంలోని అమెరికా దౌత్యవేత్తల కుటుంబ సభ్యులకు ఉన్న అలాంటి కార్డులను ఉపసంహరించుకుంది. అమెరికా కాన్సులేట్ సిబ్బంది భారత్‌లో బాధ్యతలు చేపట్టాక తమకు అవసరమైన సామగ్రిని దిగుమతి చేసుకోవడానికి ఇస్తున్న మూడేళ్ల గడువును ఆరు నెలలకు తగ్గించింది.