
ఐక్యరాజ్యసమితి: కొత్త ఏడాది ప్రారంభం రోజునే భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో ఉన్న మన దేశం 2020 జనవరి 1న శిశు జననాల్లో టాప్‌గా నిలిచింది. కొత్త ఏడాది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 4 లక్షల మంది పిల్లలు పుడితే వారిలో భారత్‌లోనే 67,385 మంది పుట్టినట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన శిశు సంరక్షణ సంస్థ యూనిసెఫ్ వెల్లడించింది. ఇక ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనా 46,299 శిశు జననాలతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ‘కొత్త సంవత్సరం ప్రారంభం, అందులోనూ కొత్త దశాబ్దం అంటే ప్రపంచ ప్రజల ఆశలు, ఆకాంక్షలు భవిష్యత్తే కాదు, కొత్తగా పుట్టిన వారి భవిష్యత్ కూడా’ అని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రియెట్ట ఫోర్ అన్నారు. మొత్తంగా జన్మించిన 3,92,078 శిశువుల్లో సగం మంది కేవలం ఎనిమిది దేశాల్లోనే జన్మించారు.
అయిదేళ్లలోపు చిన్నారుల మరణాలు ఎక్కువే
ప్రతీ ఏడాది జనవరి 1న చిన్నారుల జననాన్ని యూనిసెఫ్ ఒక వేడుకగా నిర్వహిస్తుంది. విరీ చైల్డ్ అలైవ్ పేరుతో ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. బిడ్డల్ని సంరక్షించడంలో నర్సులకి శిక్షణ ఇవ్వడానికి వెంటనే పెట్టుబడులు పెట్టడం, తల్లీ బిడ్డలకి సరైన పోషకాహారం, మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. 2018లో జనవరి 1న పుట్టిన వారిలో 25 లక్షల మంది నెలరోజుల్లోగానే మరణించారు. ఇదే అంశంపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అయిదేళ్ల వయసులోపు మరణాలు ఎక్కువగా నమోదు కావడం ఆరోగ్య రంగంలో డొల్లతనాన్ని బయటపెడుతోందని యూనిసెఫ్ అంటోంది. ప్రపంచ దేశాలు దీనిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది.
మరో ఏడేళ్లలో చైనాని దాటేస్తాం
జనాభా ఇలా పెరుగుతూ పోతే ప్రపంచంలో మనం మొదటి స్థానంలోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. 2019 నాటికి చైనా జనాభా 143 కోట్లయితే, భారత్ జనాభా 137 కోట్లుగా ఉంది. ప్రపంచ జనాభాలో చైనా వాటా 19శాతమైతే, భారత్ వాటా 18శాతం. 2027 నాటికి జనాభాలో చైనాని భారత్ దాటేస్తుందని యూనిసెఫ్ అంచనా వేస్తోంది. ఈ శతాబ్దం చివరినాటికి భారత్ 150 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, చైనా110 కోట్లతో రెండో స్థానంలో, నైజీరియా 73 కోట్లతో మూడో స్థానంలో ఉండే అవకాశాలున్నాయి. ఇక ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, పాక్‌లు ఉంటాయని యూనిసెఫ్ అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 780 కోట్లని లెక్కలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment