మాకు అభ్యంతరం లేదు.. కానీ: చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో భారత్, సింగపూర్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న నౌకాదళ విన్యాసాల పట్ల తమకు అభ్యంతరం లేదని చైనా స్పష్టం చేసింది. అయితే ఈ చర్యలు తమ దేశ ప్రయోజనాలకు, ప్రాంతీయంగా ఉన్న శాంతియుత వాతావరణానికి భంగం కలిగించరాదని చైనా పేర్కొంది. గురువారం భారత్, సింగపూర్‌ల సంయుక్త విన్యాసాలు దక్షిణ చైనా సముంద్రంలో ప్రారంభమైన నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్‌యింగ్ ఈ మేరకు స్పందించారు.
దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడానికే ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నామని చున్‌యింగ్ అన్నారు. అదే సమయంలో ఆ ప్రాంతంలోని ఇతర దేశాల ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించరాదని ఆమె సూచించారు. లేనిచో ప్రాంతీయంగా ఉన్నటువంటి శాంతి, స్థిరత్వంలపై నెగటీవ్ ఇంపాక్ట్ ఉంటుందని అన్నారు. దక్షిణ చైనా సముద్రంపై తమకే పూర్తి హక్కులు ఉన్నాయని చైనా వాదిస్తుండగా.. ఫిలిప్పీన్స్, వియత్నాం, బ్రూనై, మలేసియా, ఇండోనేషియా, తైవాన్‌లు తమకూ వాటా ఉందని పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో భారత్, సింగపూర్‌లు భాగం కానప్పటికీ.. ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలపై తమ ఆందోళన వ్యక్తం చేశాయి.