భార్య బిందుతో జాన్ ఫిలిప్ (ఫైల్)
దుబాయ్: దొంగతనాన్ని అడ్డుకోబోయి ఒమన్ లో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కేరళకు చెందిన జాన్ ఫిలిప్ హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ నెల 10 నుంచి అతడు కనిపోయించకుండా పోయాడు. పెట్రోల్ బంకులోని ఆరున్నర లక్షల రూపాయలు మాయం కావడంతో ఈ డబ్బుతో ఫిలిప్ పారిపోయాడని తొలుత భావించారు.
అయితే అతడు హత్యకు గురైనట్టు తెలియడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆరుగురు ఒమన్ దేశస్థులు అతడిని హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా సీసీ టీవీ క్యాసెట్లను మాయం చేశారు. 13 ఏళ్లుగా ఒమన్ లో పనిచేస్తున్న ఫిలిప్ కు భార్య బిందు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫిలిప్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలని కేరళ, కేంద్ర ప్రభుత్వాలను అతడి బంధువులు కోరారు.