చట్ట ప్రకారమే నా బాబును చితకబాదాను!
ఇండియానా: అమెరికాకు చెందిన ఓ మహిళ తన ఏడేళ్ల కొడుకుని చితకబాదింది. ఈ విషయాన్ని స్కూలు యాజమాన్యం గమనించి ఆ తల్లిని ప్రశ్నించగా తాను స్థానిక మత విశ్వాసాలలో ఉన్న స్వేచ్ఛతోనే కొడుకును కొట్టినట్లు చెప్పింది. ఇండియానాలో నివాసం ఉంటున్న కిన్ పార్క్ థాయింగ్(30)కి ఇద్దరు సంతానం. ఏడేళ్ల కొడుకు, మూడేళ్ల కూతురు ఉన్నారు. అయితే కొన్ని నెలల కిందట బాబు ప్రవర్తన బాగా లేదని, విపరీతమైన కోపంలో హ్యాంగర్ తీసుకుని 36సార్లు కొట్టింది.
ఆ బాలుడి చేతి, మెడ భాగాల్లో కమిలిన వాతలువచ్చాయి. ఈ విషయం పోలీసుల దృష్టికివెళ్లగా వాళ్లు ఆమెను విచారణ చేశారు. ఆమె చెప్పిన విషయం విని పోలీసులు నోరెళ్ల బెట్టారు. తప్పు చేసినప్పుడు దండించే హక్కు, స్వేచ్ఛ ఉందని స్థానిక మత విశ్వాసాల చట్టంలో ఉందని థాయింగ్ చెప్పింది. దీనిపై కోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. వచ్చే అక్టోబర్ నెలలో ఈ కేసు విచారణకు రానుంది.
పిల్లలను దండించకుండా.. మంచి అలవాట్లు ఎలా నేర్పాలో, వారికి మంచి నడవడిక నేర్పించడంపై థాయింగ్ కు ప్రాక్టికల్ క్లాసులు నిర్వహిస్తారు. 14 ఏళ్ల లోపు పిల్లలను అంత దారుణంగా హింసించడం చట్టాలను ఉల్లంఘించడమేనని పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయని తెలిపారు.