వాషింగ్టన్: తమ ఇంట్లో చొరబడిన దొంగలను ధైర్యంగా ఎదుర్కొన్నాడో ఐదేళ్ల పిల్లాడు. తుపాకీ చేతబట్టిన ఆ దుండగుల బారి నుంచి తన తల్లిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. తనను భయపెట్టాలని చేసిన ఆ దుష్టమూక మీదకు బొమ్మలు విసురుతూ వాళ్లను తరిమికొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. పిల్లాడితో పాటు అతడి తల్లి, సోదరి నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో బుల్లెట్లు పేలుస్తూ దొంగలు బయటకు పరుగులు తీశారు. ఇండియానాలో సెప్టెంబరు 30న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. (చదవండి: సెల్యూట్‌తో అలరిస్తున్న బుడ్డోడు)
ఇక దుండగుల ఆచూకీ కోసం రంగంలోకి దిగిన సౌత్ బెండ్ పోలీసులు బాధిత కుటుంబం ఇంట్లో లభించిన సీసీటీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న దుండగుల జాడ తెలిస్తే తమకు సమాచారం అందించాల్సిందిగా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన రోజు ఆ కుటుంబానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఐదేళ్ల డేవిడ్ జాన్‌సన్ ఏమాత్రం భయపడకుండా దొంగలను ఎదుర్కొన్నాడని ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు సైతం బుడ్డోడి ధైర్యసాహసాలకు ఫిదా అవుతున్నారు. అతడికి సాహస బాలుడి అవార్డు ఇవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం గురించి సౌత్‌బెండ్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘అవును నిజమే. ఆ అబ్బాయి చాలా ధైర్యవంతుడు. సెప్టెంబరు 30న ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో నలుగురు సాయుధులు వాళ్ల తలుపు తట్టారు. డోర్ తీయగానే తుపాకులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. హేయమైన నేరాలకు పాల్పడే ఇలాంటి దొంగలను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టాం. అదృష్టం బాగుంది కాబట్టి ఆరోజు ఎవరికీ ఏమీ కాలేదు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి’’అని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment