భారతీయ డాక్టర్‌ హత్య | Indian-origin dentist Preeti Reddy murdered in Sydney | Sakshi
Sakshi News home page

భారతీయ డాక్టర్‌ హత్య

Published Thu, Mar 7 2019 3:19 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Indian-origin dentist Preeti Reddy murdered in Sydney - Sakshi

డాక్టర్‌ ప్రీతిరెడ్డి

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో భారత సంతతి వైద్యురాలు దారుణహత్యకు గురైంది. సిడ్నీలో ఆదివారం జరిగిన ఓ వైద్య సదస్సుకు హాజరై అదృశ్యమైన డెంటిస్ట్‌ డా.ప్రీతిరెడ్డి(32) మృతదేహాన్ని ఓ కారులోని సూట్‌కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రీతి శరీరమంతా కత్తిపోట్లు ఉన్నాయని పోలీస్‌ అధికారులు తెలిపారు. ప్రీతి హత్యకేసులో ప్రధాన నిందితుడు, ఆమె మాజీ ప్రియుడు, డాక్టర్‌ హర్ష్‌ నర్దే సోమవారం రాత్రి 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.

ప్రీతి వద్దన్నా వెంటపడ్డ హర్ష్‌
సిడ్నీ పోలీస్‌ డిటెక్టివ్‌ సూపరింటెండెంట్‌ గ్యావిన్‌ డెన్‌గేట్‌ మాట్లాడుతూ.. ‘న్యూసౌత్‌వేల్స్‌ ఈస్ట్రన్‌ సిడ్నీ స్ట్రీట్‌లో ఉన్న ప్రీతీ కారులోని సూట్‌కేసులో ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. ప్రీతి అదృశ్యమైన అనంతరం విచారణలో భాగంగా మేం హర్ష్‌తో మాట్లాడాం. వీరిద్దరూ గతంలో కలిసిఉన్నప్పటికీ, అభిప్రాయభేదాలతో విడిపోయారు. ఈ విషయంలో ప్రీతి చాలా స్పష్టతతో ఉందని ఆమె స్నేహితులు చెప్పారు. ఇందుకు ఒప్పుకోని హర్ష్‌.. ఆమె ఎక్కడకు వెళ్లినా వెంటపడేవాడు. అందులో భాగంగా గత ఆదివారం జరిగిన వైద్య సదస్సుకు హాజరై ఉంటాడని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో తనవెంట పడొద్దని హర్ష్‌కు చెప్పేందుకే అతని హోటల్‌ గదికి ప్రీతి వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నాం. టిఫిన్‌ చేశాక ఇంటికి వస్తానన్న ప్రీతి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు’ అని తెలిపారు.

చివరిసారిగా కుటుంబ సభ్యులకు ఫోన్‌..
ప్రీతీని చివరిసారిగా జార్జ్‌స్ట్రీట్‌లోని మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్‌ దగ్గర ప్రత్యక్ష సాక్షులు చూసినట్లు గ్యావిన్‌ డెన్‌గేట్‌ తెలిపారు. ‘మెక్‌డొనాల్డ్‌లో రెండు నీళ్ల బాటిళ్లను కొనుగోలు చేసిన అనంతరం ప్రీతి మార్కెట్‌ స్ట్రీట్‌వైపు నడుచుకుంటూ వెళ్లింది. అక్కడ ఉండే ఓ హోటల్‌లో తన స్నేహితుడితో కలిసి ప్రీతి ఉంటోంది. ఈ నేపథ్యంలో తామిద్దరి మధ్య బంధం ముగిసిపోయిందని చెప్పేందుకు ప్రీతి హర్ష్‌ బసచేస్తున్న హోటల్‌కు వెళ్లి ఉంటుందని భావిస్తున్నాం’ అని వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో హర్ష్‌ మృతి..
ప్రీతీ మృతదేహం లభ్యమైన ప్రాంతానికి 340 కిలోమీటర్ల దూరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హర్ష్‌ నర్దే ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. న్యూ ఇంగ్లండ్‌ హైవేపై తన బీఎండబ్ల్యూ కారులో వేగంగా వెళుతున్న హర్ష్‌ సోమవారం రాత్రి 10 గంటలకు ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ప్రాణాలు విడిచాడని పేర్కొన్నారు. బెంగళూరులోని ఓ విశ్వవిద్యాలయంలో 2009లో హర్ష్‌ తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తిచేశాడని తెలిపారు. టామ్‌వర్త్‌లోని ఓయాసిస్‌ స్మైల్స్‌ అనే ఆసుపత్రిలో డెంటిస్ట్‌గా హర్ష్‌ పనిచేసేవాడన్నారు. విచారణ కొనసాగుతోందని డెన్‌గేట్‌ పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ప్రాథమికోన్నత విద్య
సాక్షి, హైదరాబాద్‌/జడ్చర్ల/నవాబుపేట: మహబూబ్‌నగర్‌జిల్లా నవాబ్‌పేట మండలం గురుకుంటలో డా. సంతాపురం నర్సింహారెడ్డి, రేణుక దంపతులకు ప్రీతి జన్మించారు. వీరి కుటుంబం హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో స్థిరపడింది. ప్రీతీ ప్రాథమికోన్నత విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లో సాగింది. ఉద్యోగం, పిల్లల భవిష్యత్‌ కోసం నర్సింహారెడ్డి దంపతులు 1996లో ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయారు. వైద్యవిద్య అభ్యసించిన ప్రీతి సిడ్నీ దగ్గర్లోని గ్లెన్‌బ్రూక్‌ డెంటల్‌ ఆసుపత్రిలో సర్జన్‌గా చేరారు. ప్రీతిరెడ్డి సోదరి నిత్య వైద్య విద్య చదువుతున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల తన బాబాయ్‌ దామోదర్‌ కుమార్తె పెళ్లికి ప్రీతి వచ్చారు. ప్రీతీ మరణవార్త తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రీతీ మరణవార్తతో స్వగ్రామం గురుకుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రీతికి త్వరలో పెళ్లిచేయాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులు అన్నట్లు గ్రామస్తులు చెప్పారు.


డాక్టర్‌ ప్రీతిరెడ్డి, డాక్టర్‌ హర్ష్‌ నర్దే


మంటల్లో చిక్కుకున్న హర్ష్‌ కారు


మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్‌లో చివరిసారి కనిపించిన ప్రీతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement