వావ్..! ప్రపంచంలో ఇండియన్సే టాప్
న్యూఢిల్లీ: ప్రపంచంలో భారతీయులే అత్యంత ఆత్మవిశ్వాసం గలవారని ఓ సర్వే తేల్చి చెప్పింది. తమ అభివృద్ధిని గురించి వ్యక్తిగతంగా గానీ, ఇంటర్ నెట్ ద్వారాగానీ చెప్పడంలో ప్రపంచంలోని ఏ ఇతర దేశాల్లోని ప్రొఫెషనల్స్ చెప్పలేనంత కాన్ఫిండెంట్గా చెప్తారని ఆ సర్వే స్పష్టం చేసింది. లింక్డన్ అనే ప్రముఖ సంస్థ 'యువర్ స్టోరీ @ వర్క్' అనే పేరిట ఈ సర్వేను నిర్వహించింది.
ఇందుకుగాను మే 6 నుంచి 19 తేదీల మధ్య కెనడా, అమెరికా, బ్రెజిల్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్, బ్రిటన్, ఐర్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఇండోనేషియా, మలేషియా, స్వీడన్, మెక్సికో, ఫ్రాన్స్, సింగపూర్, చైనా, జపాన్ దేశాల్లో మొత్తం 11,228మంది ఉద్యోగాల్లో ఉన్న యువకులను ప్రశ్నించింది.
ఈ సమయంలో ప్రపంచ దేశాల్లోని ఇతర యువ ఉద్యోగుల్లో కేవలం 35శాతం మాత్రమే ఆత్మ విశ్వాసం గలవారు ఉండగా ఒక్క భారత్లో మాత్రం 55శాతం ఆత్మవిశ్వాసం ఉన్నట్లు వారు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్వ్యూలో భారతీయ యువకులు మాత్రమే శభాష్ అనిపించుకుంటారని, వారిని మాత్రమే ప్రపంచ మార్కెట్ ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉంటాయని ఆ సర్వే వెల్లడించింది.