భారత విద్యార్థుల గమ్యస్థానం.. ఆస్ట్రేలియా
మెల్‌బోర్న్: ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. చైనా తర్వాత భారత్ నుంచే అధిక సంఖ్యలో విద్యార్థులు ఆస్ట్రేలియా బాట పడుతున్నారు. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 48వేల మంది పైగా భార త విద్యార్థులు ఆస్ట్రేలియాకు వెళ్లారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 11వేలు అధికం. ఈ ఏడాది జనవరి- ఏప్రిల్ మధ్య కాలంలో 48,311 మంది ఆస్ట్రేలియా బాట పట్టగా గతేడాది ఇదే సమయానికి 36,964 మంది వెళ్లారు. వీరిలో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లిన వారు 25,439 మంది. వొకేషనల్ విద్య కోసం వెళ్లిన వారు 18,350 మంది. గతేడాది ఉన్నత విద్య కోసం 17,694 మంది వెళ్లగా, వొకేషనల్ విద్య కోసం 16,772 వెళ్లారు.
ఆస్ట్రేలియాలోని నగరాల్లో విక్టోరియాకే ఎక్కువ మంది భారత విద్యార్థులు ఓటేస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో న్యూ సౌత్‌వేల్స్ ఉంది. జనవరి- ఏప్రిల్ మధ్యకాలంలో 11వేల మంది విద్యార్థులు విక్టోరియాకు వెళ్లారు. విద్యారంగంలో భారత్- విక్టోరియాల మధ్య వాణిజ్యం సానుకూలంగా సాగుతోందని భారత కాన్సుల్ జనరల్ మోనికా జైన్ తెలిపారు.
స్టూడెంట్స్ వీసా నిబంధనలు సరళీకృతం చేయడంతో పాటు ‘పోస్ట్ స్టడీ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ’ పేరిట కోర్సు పూర్తయ్యాక ఆస్ట్రేలియాలోనే రెండేళ్లు ఉద్యోగం చేసే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం కల్పిస్తోంది. అదేవిధంగా అభ్యర్థులు చూపించాల్సిన ఆర్థిక మొత్తాన్ని కూడా కొంత తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించడం.. విద్యార్థులు ఆస్ట్రేలియా వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణమని ఓ ప్రైవేట్ ట్రైనింగ్ కాలేజ్ యజమాని తెలిపారు.