హాలివుడ్‌లో మంజరి సంచలనం
న్యూఢిల్లీ: 2016 సంవత్సరం వరకు విడుదలైన 250 హాలివుడ్ టాప్ చిత్రాల్లో ఏడు శాతం చిత్రాలకు మాత్రమే మహిళలు దర్శకత్వం వహించారు. అంటే, ఈ రంగంలో మహిళలు ఎంతో వెనకబడి ఉన్నారన్న మాట. ఇలాంటి రంగంలోకి అడుగుపెట్టిన భారతీయ మహిళ మంజరి మకిజాని సంచలనం సృష్టిస్తున్నారు. ఇటీవల హాలివుడ్‌లో సంచలనం సృష్టించిన వాండర్ విమెన్, డన్‌కిర్క్ లాంటి చిత్రాలకు దర్శక సహకారంతో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న మంజరి త్వరలోనే ఓ హాలివుడ్ ఫీచర్ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు.
ముంబై నగరంలో పుట్టి పెరిగి గత మూడేళ్లుగా లాస్ ఏంజెలిస్‌లో స్థిరపడిన మంజరి మరెవరో కాదు, బాలివుడ్ చిత్రం ‘షోలే’లో సాంబగా నటించిన మోహన్ మకిజాని అలియాస్ మ్యాక్ మోహన్ పెద్ద కూతురు. చిన్నప్పటి నుంచి ముంబైలోని పథ్వీ థియేటర్‌లో తండ్రి వెంట నాటక ప్రదర్శనలకు వెళ్లిన మంజరికి సినిమాల దర్శకత్వంపైకి దష్టి మల్లింది. చిన్నప్పటి నుంచి ప్రతి పాత్ర ఇలా ఎందుకు చేసింది? అలా ఎందుకు చేయలేదు? అంటూ తండ్రిని ప్రశ్నిస్తుండడంతో తండ్రి ఆమెలో దర్శకత్వం లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారట. ఇక ఆ తండ్రి ప్రోత్సాహంతోనే ఆమె సినిమా రంగ ప్రవేశం చేశారు.
ఆమె తొలుత తీసిన ‘ఐ సీ యూ’ అని షార్ట్ ఫిల్మ్ హిట్టవడంతో ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ షార్ట్ ఫిల్మ్‌ను జూలై 27వ తేదీ నుంచి అమెరికాలో జరుగనున్న 40వ ఆసియన్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్నారు. 2017 సంవత్సరానికి ‘ఫాక్స్ ఫిల్మ్‌మేకర్స్ ల్యాబ్’కు కూడా ఆమె ఎంపికవడం విశేషం. సాత్ కూన్ మాఫ్ బాలివుడ్ చిత్రానికి దర్శకుడు విశాల్ భరద్వాజ్, వేకబ్ సిద్ చిత్రానికి దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మంజరి 2011లో విడుదలైన హాలివుడ్ చిత్రం ‘ది లాస్ట్ మార్బుల్’ చిత్రానికి, 2014లో విడుదలైన ‘ది కార్నర్ టేబుల్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మంజరి దర్శకురాలే కాకుండా చిత్ర కథా రచయిత కూడా. ఆమె భర్త ఎమాన్యువల్ పప్పాస్ కూడా సినిమా దర్శకుడే.