కీవ్: బాంబుల మోత మోగు తూ ఉంటే, క్షిపణులు వచ్చి మీద పడు తూ ఉంటే రాజు పేద తేడా లేనే లేదు. ఉండేదల్లా ప్రాణభయమే. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటే ఎన్నో కష్టనష్టాలను పంటి బిగువున భరించాల్సి ఉంటుంది. యుద్ధంపై డాక్యుమెంటరీ తీయడానికి ఉక్రెయిన్ వెళ్లి ఇరుక్కుపోయిన హాలీవుడ్ నట దర్శకుడు, ఆస్కార్ గ్రహీత సీన్ పెన్‌కు అలాంటి భయంకరమైన అనుభవాలే ఎదురయ్యాయి.
గత ఏడాది నవంబర్ నుంచి ఉక్రెయిన్‌లో ఉంటూ ఉద్రిక్తతల్ని కెమెరాలో బంధిస్తున్న ఆయన చివరికి తన ప్రాణాలే ప్రమాదంలో పడడంతో కాళ్లకి పని చెప్పాల్సి వచ్చింది. 61 ఏళ్ల వయసులో మైళ్లకి మైళ్లు నడిచి పోలండ్ సరిహద్దులకి చేరుకున్నారు. రష్యా దాడిని తీవ్రతరం చేయడంతో ప్రాణ రక్షణ కోసం లక్షలాది మంది ఉక్రెయిన్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మొదలు పెట్టారు. అన్ని సరిహద్దుల్లోనూ మైళ్ల కొద్దీ కార్లు వరస కట్టాయి. సీన్ పెన్, ఆయన బృందం కారులో వెళ్లడానికి సమయం సరిపోదని భావించి దానిని వదిలేసి నడుచుకుంటూ పోలాండ్ సరిహద్దులకు చేరుకున్నారు.
‘‘నేను, నా కొలీగ్స్ ఇద్దరూ కారుని రోడ్డు పక్కనే వదిలేసి మైళ్ల కొద్దీ నడుచుకుంటూ వచ్చాం. దారి పొడవునా నిలిచిపోయిన అన్ని కార్లలోనూ మహిళలు, పిల్లలే ఉన్నారు. వాళ్లెవరూ తమ వెంట లగేజీ తీసుకు రాలేదు. ఎంత మంది పడితే అంత మంది కార్లలోకి ఎక్కేసి సరిహద్దుల వైపు బయల్దేరారు’’ అని ట్విటర్ వేదికగా పెన్ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘పుతిన్ చాలా క్రూరమైన తప్పు చేస్తున్నారు. ఎందరో జీవితాల్ని బలి తీసుకుంటున్నారు. ఆయనలో పశ్చాత్తాపం రాకపోతే మానవాళికే తీరని ద్రోహం చేసిన వారవుతారు’’ అని దుయ్యబట్టారు. ‘‘ఉక్రెయిన్ ప్రజలు ధైర్యానికి, నిబద్ధతకి చారిత్రక సంకేతాలుగా మిగిలిపోతారు’’ అని కొనియాడారు. పెన్ ఉక్రెయిన్‌లో ఉండగా అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలుసుకున్నారు. రష్యా దాడి మొదలు పెట్టడానికి ముందు ప్రభుత్వం నిర్వహించిన ప్రెస్ మీట్‌లోనూ పాల్గొన్నారు.
(చదవండి: ‘జెలెన్‌స్కీ’ బిజినెస్ బ్రాండ్)
Comments
Please login to add a commentAdd a comment